మధ్యధరా సముద్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆఫ్రికా దేశాల నుంచి వలసదారులతో జువారా నుంచి యూరప్ కు వయలుదేరిన బోటు లిబియా తీరంలో బోల్తా పడటంతో 61 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో బోటులో మహిళలు, చిన్నారులు సహా మొత్తం 86 మంది ఉన్నట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) వెల్లడించింది. ఈ ప్రమాదంలో 25 మందిని రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా బయటికి తీసుకొచ్చాయి. వారిని లిబియా డిటెన్షన్ సెంటర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంతో ఈ ఏడాదిలో దాదాపు 2,200 మంది ఇలా ప్రాణాలు కోల్పాయినట్లు IOM అంచనా వేసింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. లిబియా పశ్చిమ తీరంలోని జువారా పట్టణ సమీపంలో బలమైన అలల తాకిడికి పడవ కొట్టుకుపోయినట్లు ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు వెల్లడించారు.