జొహెన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 45 మంది దుర్మరణం పాలయ్యారు. ఈస్టర్ పండుగ కోసం చర్చికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా బస్సు 165 అడుగుల లోయలో బస్సు పడిపోగా.. ఒక్కసారిగా భారీగా మంటలు చేలరేగాయి. ఈ ఘటనను చూసిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం బస్సులో 46 మంది ప్రయాణిస్తుండగా.. అందులో 8 ఏండ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది.
ఈస్టర్ పండుగకు బస్సు బోట్స్‌వానా నుంచి మోరియాకు బయల్దేరింది. అక్కడున్న కొండపై నిర్మించిన వంతెన క్రాసింగ్ వద్ద బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకపోయింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా 45 మంది మృతి చెందారు. ప్రాణాలతో బయటపడ్డ 8 ఏండ్ల బాలికను సమీప ఆస్పత్రికి తరలించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోయలో నుంచి మృతదేహాలను వెలికితీస్తున్నారు. ప్రమాదంలో చేలరేగిన మంటల ధాటికి మృతదేహాలన్ని పూర్తిగా కాలిపోయాయి. దీంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది.
ఈ ప్రమాద ఘటనపై బోట్స్‌వానా అధ్యక్షుడు, సౌతాఫ్రికా అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రయాణికులు వెళ్లాలనుకున్న జియాన్ చర్చ్ ఆ దేశంలో ఉన్న అతిపెద్ద చర్చిల్లో ఒకటి అని పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికాలో ఈస్టర్ పండుగ నాడు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రార్థనల కోసం వెళుతున్న బస్సు లోయలోకి పడిపోవడంతో 45 మంది మరణించగా.. 8 ఏళ్ల బాలిక మాత్రమే ప్రాణాలతో బయపడింది. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
#SouthAfrica #busaccident #Valley #Easter #ZionChurch pic.twitter.com/IKji6pRKfd
— Dial News (@dialnewstelugu) March 29, 2024