కనీసం ఆయా వ్యక్తుల కుటుంబ సభ్యులు.. తమ వారి చివరి చూపుకు కూడా నోచుకోక.. దగ్గరుండి దహన సంస్కారాలను చేయలేక పోతే వాళ్లు పడే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో ఆలోచించండి. కొన్ని రోజుల క్రితం ఒడిశా బాలాసోర్‌లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదం కూడా ఇలాంటి విషాదాన్ని మనముందు ఉంచింది. ప్రమాదంలో ఎంతమంది చనిపోయారా లెక్కతేలినా.. వాళ్లు ఎవరో వాళ్ల కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో.. ఏ మృత దేహాన్ని ఎవరికి అప్పగించాలో.. అంతుపట్టని పరిస్థితిలో రైల్వేశాఖ ఉంది.
ఆధార్‌తో సీడింగ్ ఒక్కటే మార్గమా?
ప్రమాదాలను ఎలాగూ నివారించలేకపోతున్నారు. కనీసం ప్రమాదాలు జరిగిన తర్వాతైనా చేయాల్సిన పనులు వేగంగా చేస్తే బాధిత కుటుంబాల కన్నీరు తుడిచినట్టు అవుతుంది. మూడు రైళ్లు ఒకేసారి ఢీకొనడం.. అసలు ప్రమాదం ఎలా జరిగిందో తెలుకోవడానికే చాలా రోజులు పట్టడం.. మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు ఇవ్వడంలో ఆలస్యం.. ఇలా కోరమండల్ ప్రమాదం నుంచి గుణపాఠం నేర్చుకున్న రైల్వేశాఖ…భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఆధార్‌తో టిక్కెట్ల సీడింగ్‌ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీని ద్వారా ప్రయాణికుల వివరాలు వెంటనే తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. అందుకే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కేటాయించే PNR నెంబర్‌కు ఆధార్‌ను అనుసంధానం చేయాలని రైల్వేశాఖ భావిస్తోంది. రిజర్వేషన్ టిక్కెట్లతోపాటు అన్ రిజర్వ్ డ్ టిక్కెట్లకు కూడా ఆధార్‌ను లింక్ చేసే ఆలోచనలో ఉంది.
PNRకు ఆధార్‌ను సీడ్‌చేస్తే ఏమవుతుంది?
రైళ్లలో ప్రయాణించడానికి గుర్తింపుగా ఆధార్ నంబర్‌ను ఇవ్వడం వేరు.. ఆధార్‌ను PNRతో సీడ్ చేయడం వేరు. ఇప్పటి వరకు కేవలం ప్యాసింజర్ గుర్తింపు కోసం మాత్రమే రైల్వే శాఖ ఆధార్ నంబర్‌ను తీసుకుంటుంది. కానీ కొత్త విధానం అమలులోకి వస్తే ఆధార్‌ను నేరుగా పీఎన్ఆర్‌తో అనుసంధానం చేస్తారు. అంటే ఆధార్‌లో ఉన్న డేటా మొత్తం PNRకి కనెక్ట్ అవుతుంది. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు.. పీఎన్ఆర్ లేదా ఆధార్ నెంబర్ ద్వారా వెంటనే.. ప్రయాణికుల పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మృతదేహాలను గుర్తించడానికి డీఎన్ఏ నమూనాలను సేకరిస్తున్నారు. ఈ విధానంలో ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం పడుతుంది..పైగా ఖర్చు కూడా ఎక్కువ. ఆధార్‌తో సీడ్ చేస్తే ఈ సమస్యలేమీ ఉండవ్. ప్రమాదం జరిగిన వెంటనే వేలిముద్రలను ఆధార్‌డాటాబేస్‌లో పోల్చుకుంటే.. వెంటనే ప్రయాణికుల వివరాలు వచ్చేస్తాయి. ఫోన్ నెంబర్, అడ్రెస్, ఈ మెయిల్ వంటి వివరాలను ఆధార్ సేకరించి తక్షణం బాధిత కుటుంబాలకు సమాచారం అందించే అవకాశం ఉంటుంది. ఆధార్ వ్యవహారాలు చూసే యునిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా, రైల్వేలు కలిసి సమాచారాన్ని మార్చుకుంటే.. వెంటనే మృతదేహాలను గుర్తించడం, బాధిత కుటుంబాలకు చెప్పడం జరిగిపోతుంది. గతంలోనే ఈ విధానాన్ని అమలు చేయాలని భావించినా.. అప్పట్లో కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఆధార్ వివరాలను రైల్వే అధికారులు సేకరిస్తే వ్యక్తిగత డేటా బయటకు వస్తుందని కొంతమంది వాదించారు. అలాంటి జరిగే అవకాశమేమీ లేకపోయినా..అప్పట్లో ఈ విధానంపై రైల్వే శాఖ పెద్దగా ఫోకస్ పెట్టలేదు. అయితే దేశ చరిత్రలోనే ఎప్పుడూ చూడని స్థాయిలో కోరమండల్ రూపంలో ఘోర ప్రమాదం జరగడంతో రైల్వే శాఖ గుణపాఠం నేర్చుకుంది. ఆధార్ ద్వారా మాత్రమే పనులు త్వరగా పూర్తవుతాయని గుర్తించింది. ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
మరి భద్రత సంగతేంటి
ప్రమాదం జరిగిన తర్వాత మృతదేహాలను త్వరగా గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలన్న ఆలోచన బాగేనే ఉంది. కానీ అసలు ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత రైల్వే శాఖపై ఉంది కదా. వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు ఎన్ని ప్రారంభించినా.. రైల్వేను ఆధునీకరిస్తున్నామంటూ ఆ శాఖమంత్రి ట్విట్టర్‌లో ఎంత ఊదరగొట్టినా.. ప్రమాదాలను మాత్రం నివారించలేకపోయారు. రైల్వేలను ఆధునీకరించడానికి పెట్టిన శ్రద్ధ, ఖర్చు కంటే.. ప్రయాణికుల భద్రత కోసం తీసుకున్న చర్యలు తక్కువని ఇప్పటికే తేలిపోయింది. ఇకపైనా భారతీయ రైల్వే ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చకపోతే.. కోరమండల్ తరహా ప్రమాదాలను ఈ దేశం ఇంకా చూడాల్సి వస్తుంది.