అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎఫ్‍పీవోను అదానీ గ్రూప్ ఉపసంహరించుకుంది. ఎఫ్‍పీవోలో పార్టిసిపేట్ చేసిన ఇన్వెస్టర్ల సొమ్ము తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించింది. తీవ్ర అనిశ్చితి మధ్య కూడా విజయవంతమైన ఎఫ్‍పీవో(FPO)ను అదానీ గ్రూప్ (Adani Group) వెనక్కి తీసుకుంది. ఎఫ్‍పీవోకు సబ్‍స్క్రైబ్ చేసుకున్న ఇన్వెస్టర్లకు డబ్బును తిరిగి రీఫండ్ చేయనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. రూ.20వేల కోట్లను సేకరించేందుకు అదానీ ఎంటర్ ప్రైజెస్ (Adani Enterprises) ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO)ను అదానీ గ్రూప్ నిర్వహించింది. ఆరంభంలో అత్యల్పంగా సబ్‍స్క్రైబ్ అయింది. ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి కనిపించలేదు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా 100శాతం సబ్‍స్క్రైబ్ అయింది. ఎఫ్‍పీవో విజయవంతమైంది. అయితే తాజాగా ఈ ఎఫ్‍పీవోను ఉపసంహరించుకునేందుకు అదానీ గ్రూప్ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధినేత గౌతమ్ అదానీ (Gautam Adani) ప్రకటించారు. ఎఫ్‍పీవో వెనక్కి ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారో వెల్లడించారు.
ఇన్వెస్టర్ల ప్రయోజనం కోసమే ఎఫ్‍పీవోను వెనక్కి తీసుకుంటున్నామని గౌతమ్ అదానీ ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియో స్టేట్‍మెంట్‍ను విడుదల చేశారు. ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచి ఉండొచ్చని అన్నారు. తమ కంపెనీ ఫండమెంటల్స్ చాలా బలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. రుణాల చెల్లింపుల ట్రాక్ కూడా అత్యుత్తమంగా ఉందని గౌతమ్ అదానీ అన్నారు. “నేను జీవితంలో సాధించిన విజయాలకు ఇన్వెస్టర్లకు నాపై ఉన్న నమ్మకం, విశ్వాసం కారణమని భావిస్తా. నాకు వరకు, నా ఇన్వెస్టర్ల ప్రయోజనమే అత్యంత ప్రాధాన్యమైన విషయం. మిగిలినవన్నీ ఆ తర్వాతే. అందుకే ఇన్వెస్టర్లకు నష్టం వచ్చే అవకాశం ఉన్నందునే ఎఫ్‍పీవోను ఉపసంహరించుకుంటున్నాం” అని గౌతమ్ అదానీ చెప్పారు. ఎఫ్‍పీవోను కొనసాగించడం నైతికం కాదని భావించామని వెల్లడించారు.
అమెరికాకు చెందిన హిండెన్‍బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) సంస్థ ఆరోపణల తర్వాత అదానీ గ్రూప్‍నకు చెందిన షేర్లన్నీ భారీగా పడిపోతున్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ షేర్ ధర గత ఐదురోజుల్లోనే సుమారు 40శాతానికి పైగా పడిపోయింది. గురువారం ట్రేడింగ్ సెషన్‍లో ప్రస్తుతం రూ.1,919 వద్ద ఉంది. ఆ గ్రూప్‍నకు చెందిన మిగిలిన కంపెనీ షేర్ల పరిస్థితి ఇలానే ఉంది. దీంతో ప్రపంచ అత్యధికుల జాబితా టాప్-10లో స్థానాన్ని కోల్పోయారు గౌతమ్ అదానీ.
అదానీ గ్రూప్ భారీ అవకతవకలకు పాల్పడుతోందని హిండెన్‍బర్గ్ ఆరోపించింది. 82 ప్రశ్నలను అదానీ సంస్థలకు సంధించింది. ఇందుకు అదానీ సంస్థ స్పందించింది. దేశంపై జరుగుతున్న దాడిగా అభివర్ణించింది. అదానీ గ్రూప్ చెప్పిన విషయాలకు హిండెన్‍బర్గ్ సంతృప్తి చెందలేదు. కీలకమైన విషయాలను పక్కదోవ పట్టించేందుకు జాతీయత అంశాన్ని తీసుకొస్తున్నారంటూ ఆరోపించింది.