ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం మారబోతోంది. ప్రస్తుతం ఆ ఫ్రాంచైజీకి ఓనర్ గా ఉన్న సీవీసీ క్యాపిటల్స్ మెజార్టీ షేర్ విక్రయించేందుకు సిద్ధమవుతోంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం కొత్త జట్లలో వాటాలను విక్రయించేందుకు ఉన్న లాక్ పిరియడ్ వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సీవీసీ క్యాపిటల్స్ మెజార్టీ వాటాను అమ్మకానికి పెట్టబోతున్నట్టు సమాచారం. గుజరాత్ టైటాన్స్‌పై అదానీ గ్రూప్ ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా వాటాను కొనుగోలు చేయడానికి అదానీ గ్రూప్, టొరెంట్ గ్రూప్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్ పార్ట్‌నర్స్‌తో చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
గుజరాత్ టైటాన్స్ విలువ 1 బిలియన్ డాలర్ల నుంచి 1.5 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా.. సీవీసీ క్యాపిటల్ 2021లో ఈ ఫ్రాంచైజీని 5 వేల 625 కోట్లకు కొనుగోలు చేసింది. తొలి సీజన్ లోనే గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్ గా నిలవడంతో ఆ ఫ్రాంచైజీ బ్రాండ్ వాల్యూ కూడా పెరిగింది.కాగా అదానీ గ్రూప్ ఇప్పటికే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ , యూఏఈ ఇంటర్నేషనల్ లీగ్ టీ20ల్లో జట్లను కొనుగోలు చేసింది. వుమెన్స్ లీగ్ లో అహ్మదాబాద్ ఫ్రాంచైజీని అదానీ గ్రూప్ 1,289 కోట్ల టాప్ బిడ్‌తో దక్కించుకుంది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకూ మూడు ఐపీఎల్ సీజన్స్‌లో ఆడింది. గత సీజన్ లో ఫైనల్ కు చేరిన ఆ జట్టు ఈ ఏడాది 8వ స్థానానికే పరిమితమైంది.