చాలారోజుల సస్పెన్స్ తర్వాత.. తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టేరోజు అసెంబ్లీలో అడుగు పెట్టారు కేసీఆర్. అప్పుడు చూడాలి బీఆర్ఎస్ శ్రేణుల హడావుడి. సింగం ఈజ్ బ్యాక్.. ఇక దబిడిదిబిడే అని సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సార్ ఫుల్ ప్రిపేర్ అయి వచ్చారు.. రేవంత్ సర్కార్‌కు ఇక చుక్కలే అని ఎవరికి వారు ఏదేదో అనేశారు. కట్ చేస్తే.. మళ్లీ అసెంబ్లీ పరిసరాల్లో కనిపించలేదు కేసీఆర్. కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద కేసీఆర్ చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఇదో అర్బక ప్రభుత్వమని.. బడ్జెట్‌లో ప్రభుత్వం అన్ని వర్గాల జనాలను మోసం చేసిందని… ఏడు నెలలైనా కొత్త పాలసీ ఫార్ములేషన్ లేదని.. స్టేట్ బడ్జెట్ ఒక ట్రాష్.. దాని నిండా గ్యాసే అంటూ సెటైర్ల మీద సెటైర్లు వేశారు.
వ్యవసాయ పాలసీ, పారిశ్రామిక, ఐటీ పాలసీలు బడ్జెట్‌లో కనిపించకపోవడం.. ప్రభుత్వ తీరుకు నిదర్శనం అంటూ కామెంట్లు చేశారు. ఇక నుంచి తన ఉగ్రరూపం చూస్తారని.. ప్ఱబుత్వాన్ని, బడ్జెట్‌ను చీల్చిచెండాడుతానని అసెంబ్లీ దగ్గర తొడ కొట్టినంత పని చేశారు. ఇదే నిజం అనుకున్నారు జనం కూడా ! ఇక కేసీఆర్ అసెంబ్లీకి రెగ్యులర్‌గా హాజరవుతారని.. రేవంత్‌కు, సర్కార్‌కు చుక్కలు చూపిస్తున్నారని అంతా అనుకున్నారు. రేవంత్, కేసీఆర్ మధ్య మాటల యుద్ధం నడుస్తుందని అంతా భావించారు. ఐతే కేసీఆర్ మాత్రం సభకు డుమ్మా కొట్టేశారు.
బడ్జెట్ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదన్న గులాబీ బాస్.. కాంగ్రెస్‌ను ఉతికారేస్తారనుకుంటే.. సభకు డుమ్మా కొట్టి సర్‌ప్రైజ్ చేశారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌కు ఆయుధంగా మారింది. అంతన్నావ్, ఇంతన్నావ్.. ఇలా చేశావేంటి కేసీఆర్ అని కొందరు.. ఎక్కడపోయావ్ కేసీఆర్ అని మరికొందరు.. రేవంత్‌ను ఎదుర్కోవాలంటే భయమేస్తుందా కేసీఆర్ అని ఇంకొందరు.. కేసీఆర్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. అప్పుడే చల్లబడ్డవా.. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు అంటూ సవాల్ విసురుతున్నారు.