తెలంగాణలో 10యేళ్ళు పాలించి… అధికార దర్పంతో వ్యహరించిన కేసీఆర్ కు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. అయ్యో… కేసీఆర్ కి వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదని కోరుకుంటున్నారు కొందరు కేసీఆర్ విధేయనేతలు. మొన్నటి దాకా BRS ఎమ్మెల్యేలంతా చాప చుట్టేస్తున్నారు. కాంగ్రెస్ లో చేరిపోతున్నారన్న వార్తలతో కేసీఆర్ బెంబేలెత్తిపోయారు. ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్సీలు గాంధీభవన్ కు క్యూ కడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ను దింపేస్తాం… లేపేస్తాం… రేవంత్ రెడ్డి ఎవడు బచ్చా… అంటూ మొన్నటిదాకా డాంబికాలు పోయిన కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో నోరు తెరవట్లేదు. మొన్నీమధ్యే ఎమ్మెల్యేలను పిలిచి బతిమలాడుకున్నారు కేసీఆర్. కానీ వాళ్ళల్లో ఎంతమంది బీఆర్ఎస్ లో ఉంటారో తెలీదు. వాళ్ళు మనోళ్ళే… పార్టీ మారరు అనుకుంటేనే… పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్, యాదయ్య కాంగ్రెస్ లో చేరి కేసీఆర్ కు షాక్ ఇచ్చారు.
శాసనసభతో పాటు మండలిలో BRS LPలను విలీనం చేయాలని కాంగ్రెస్ దూకుడుగా వెళ్తోంది. దాంతో రేవంత్ స్పీడ్ ను కేసీఆర్ అందుకోలేకపోతున్నారు. అటు కేటీఆర్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ట్విట్టర్ కే పరిమితం అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమితో కేటీఆర్ కాడె వదిలేశారు.
పాతిక మంది దాకా BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరడానికి రెడీగా ఉన్నారని అంటున్నారు. వీళ్ళతో పాటు కనీసం 10మంది ఎమ్మెల్సీలు కూడా కేసీఆర్ కు హ్యాండిస్తారట. చేతుల కాలాక అన్నట్టుగా… ఆలస్యంగానైనా కేసీఆర్.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఫామ్ హౌజ్ కి పిలిపించుకొని మాట్లాడుతున్నారు. కానీ డైరెక్ట్ గా నువ్వు పార్టీ మారతావా అని డైరెక్ట్ గా అడగలేని పరిస్థితి. అడిగితే ఓ బాధ… అడగకపోతే ఇంకో బాధ అన్నట్టుంది మాజీ సీఎం పరిస్థితి. ఇంకో నాలుగు రోజులు పోతే… మంత్రులు చెప్పినట్టు ఆ ఐదుగురే బీఆర్ఎస్ లో మిగులుతారేమోనన్న భయం కార్యకర్తల్లో వెంటాడుతోంది.