వాహన టైర్లలో గాలి నింపడం కొద్దిపాటి శ్రమతో కూడుకున్న పనే. సైకిళ్ళలో గాలి నింపేందుకు స్పింగ్ యాక్షన్ తో కూడిన పంపులు ఒకప్పుడు వాడే వారు. క్రమ క్రమంగా కరెంట్ మోటార్ లతో సిలిండర్లలో గాలిని నింపి అవసరమైనప్పుడు రకరకాల వాహన టైర్లలో ప్రస్తతం గాలిని నింపుతున్నారు. ఇక బైకులు, కార్లు అయితే పెట్రోల్ బంకులను ఆశ్రయిస్తున్నారు. వీటన్నింటినీ అధిగమిస్తూ మనమే క్షణాల్లో గాలిని టైర్లలో నింపే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.
మనం ఎక్కడికైనా దూర ప్రాంతాలకు లేదా అత్యవసర పనిమీద రకరకాల వాహనాలలో ప్రయాణం చేస్తూ ఉంటాం. వాహన టైర్లలో గాలి ఉందా లేదా అని చూసుకునేంత సమయం ఉండదు. అలా ప్రయాణాలు చేస్తున్న క్రమంలో టైర్లలో ఉన్నపళంగా గాలి పూర్తిగా పోతే ఏదో ఒక పంచర్ షాపు దగ్గర తీసుకెళ్లి గాలి కొట్టిస్తాం. అదే హైవే మధ్యలో, ఎవరూ లేని ప్రాంతాల్లో గాలి పోతే పరిస్తితి ఏంటి.. అందులోనూ ఫ్యామిలీతో కలిసి వెళ్లే టప్పుడు ఇలాంటి సమస్య తలెత్తితే ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు సరికొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. దీనినే మినీ టైర్ ఇన్ ఫ్లేటర్ అంటారు. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
అమెరికాకు చెందిన థామస్ పంప్స్ అనే కంపెనీ దీనిని తయారు చేసింది. ఇది అరచేతిలో పట్టుకునేలా చిన్న పరిమాణంలో ఉంటుంది. జేబులో పెట్టుకొని వెళ్లచ్చు. ఒకప్పటి సెల్ ఫోన్ బ్యాటరీ అంత సైజులో ఉంటాయి. దీని బరువు కేవలం 115 గ్రాములు మాత్రమే. దీనిని కరెంట్ తో చార్జింగ్ చేయాల్సి ఉంటుంది. 25 నిమిషాల్లో ఫుల్ అవుతుంది. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ అయితే దాదాపు 70 సెకన్లలో టైర్లలో గాలిని నింపవచ్చు. బైకులు, కార్లు, లారీలకు కూడా గాలిని నిపుంకోవచ్చు అయితే కాస్త ఎక్కువ సమయం పడుతుంది అని చెబుతున్నారు. దీనిని ఆన్లైన్ షాపింగ్ లో అన్ని ఈ కామర్స్ ప్లాట్ ఫాంలలో అందుబాటులో ఉంచారు. అయితే దీనిని ధర మన కరెన్సీ ప్రకారం 9వేల రూపాయలకు పైగా ఉంటుంది.
T.V.SRIKAR