తన కుమారుడి వ్యక్తిగత జీవితంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల అక్కినేని నాగార్జున అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేసారు. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి అని కోరారు.
దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండని విజ్ఞప్తి చేసారు. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం అని నాగార్జున స్పష్టం చేసారు. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నానన్నారు.