Amanchi Swamulu to join in Janasena?: జనసేనలోకి ఆమంచి సోదరుడు…?

  • Written By:
  • Publish Date - February 11, 2023 / 12:07 PM IST

బాపట్ల జిల్లాలో వైసీపీ షాక్ తగలబోతోందా…? సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారా…? అవుననే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఫ్యాన్ స్విచ్ కట్టేసి గాజు గ్లాస్ పట్టుకోబోతున్నట్లు నియోజకవర్గంలో జోరుగా చెప్పుకుంటున్నారు. తాజాగా జనసేన ఫ్లెక్సీలో ఆమంచి స్వాములు ఫోటోతో వైసీపీలో ఒక్కసారిగా కలకలం మొదలైంది..

 

వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో జనసేన నేతలు పార్టీ సభ్యత్వం నమోదు సందర్బంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో పవన్ ఫోటోలుంటే పర్లేదు. కానీ పవన్ పక్కనే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు ఫోటోలు కూడా ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా ఇష్యూ హాట్‌టాపిక్‌గా మారింది. ఆమంచి స్వాములు తన సోదరుడు కృష్ణమోహన్‌తో కలసి ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నారు. ఫ్లెక్సీ వివాదంపై స్వాములు వర్గం తీరు కూడా అనుమానాలను రేకెత్తిస్తోంది. ఆ ఫ్లెక్సీలతో తమకు సంబంధం లేదంటున్నారు. అదే సమయంలో ఫ్లెక్సీలు తొలగించాలని కనీసం డిమాండ్ కూడా చేయడం లేదు. దానిపై మాత్రం మౌనం పాటిస్తున్నారు. దీంతో స్వాములు పార్టీ మారతారన్న ప్రచారానికి బలం చేకూరినట్లైంది. నిజంగా స్వాములు పార్టీ మారతారా లేక వైసీపీ హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చేందుకే ఇలా చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.

జనసేన ఫ్లెక్సీల్లో ఆమంచి స్వాములు ఫోటో

ఆమంచి కృష్ణమోహన్‌ అడ్డా చీరాల. అయితే గత ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనపై గెలిచిన టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం తర్వాత వైసీపీలో చేరారు. దీంతో ఇరువర్గాలు ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరించాయి. వ్యవహారం దాడుల వరకు వెళ్లింది. ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టిన వైసీపీ హైకమాండ్ చీరాలను కరణంకే అప్పగించింది. ఆమంచిని చీరాల నుంచి పర్చూరుకు పంపింది. అయిష్టంగానే ఆమంచి పర్చూరు బాట పట్టారు. ఈ సమయంలో ఆమంచి స్వాములు ఫోటో జనసేన ఫ్లెక్సీకి ఎక్కడం ఆసక్తికరంగా మారింది.

ఈ సమయంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది…
1). ఆమంచి కృష్ణమోహన్‌కు సోదరుడి పక్కచూపుల సంగతి తెలుసా…?
2). ఆయనకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందా…?
3). కృష్ణమోహన్‌ దీన్ని వ్యతిరేకిస్తే ఆయన ఏం చేయబోతున్నారు…?
4). కరణం వర్గానికి చెక్ పెట్టేందుకే స్వాములు ఇలా చేస్తున్నారా…?
5). వైసీపీ హైకమాండ్‌ దీన్ని ఎలా చూస్తుంది…?

ఓ నియోజకవర్గాన్ని చక్కదిద్దితే మరోచోట లుకలుకలు మొదలవుతున్నాయి. మరి ఈ వ్యవహారంలో వైసీపీ ఏం చేస్తుందన్నది ఆసక్తిని రేపుతోంది. కృష్ణమోహన్‌ను బరిలోకి దించి స్వాముల్ని బుజ్జగిస్తుందా లేక మరో మార్గాన్ని ఆలోచిస్తుందా అన్నది చూడాలి.

(KK)