Amaravati: ఏపీ రాజధాని అమరావతే.. మళ్ళీ చెప్పిన కేంద్ర ప్రభుత్వం

ఆంధ్రప్రదేవ్ రాజధాని విషయంలో ఇంకా గందరగోళం కొనసాగుతోంది. మూడు రాజధానులను చేస్తామంటూ... పరిపాలన రాజధానిగా విశాఖపట్నంను ప్రకటించారు సీఎం జగన్. త్వరలో అక్కడ కార్యకలాపాలు ప్రారంభించబోతున్న టైమ్ లో కేంద్ర ప్రభుత్వం అమరావతే రాజధానిగా పేర్కొనడం జగన్ సర్కార్ కు ఇబ్బందిగా మారింది.

  • Written By:
  • Publish Date - December 4, 2023 / 07:46 PM IST

Amaravati: విశాఖ నుంచి పరి పాలన ప్రారంభించడానికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్ అంతా ప్రిపేర్ చేసుకున్నారు.  కానీ ఈ టైమ్ లో కేంద్ర ప్రభుత్వం జగన్ సర్కార్ కి షాక్ ఇచ్చింది. ఏపీ రాజధానిగా అమరావతినే గుర్తిస్తున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ ను కూడా ఆమోదించినట్లు కేంద్రం తెలిపింది.  దేశంలోని 28 రాష్ట్రాల రాజధానుల జాబితాను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇందులో ఏపీ రాజధాని అమరావతిగా తెలిపింది. పార్లమెంటులోనే ఏపీ రాజధాని అమరావతి అని క్లారిటీ ఇచ్చింది కేంద్రం.

దేశంలోని 39 శాతం రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్నది నిజమేనా  అని రాజ్యసభలో ఎంపీ జావెద్ అలీఖాన్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్న నిజం కాదన్నారు. ఏపీ రాజధాని అమరావతితో సహా 26 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉందని కేంద్రం తెలిపింది. త్రిపుర రాజధాని అగర్తల, నాగాలాండ్ రాజధాని కోహిమా తప్ప మిగతా రాజధానుల మాస్టర్ ప్లాన్ లను ఆమోదించినట్లు కేంద్ర మంత్రి రాజ్యసభలో తెలిపారు. చంద్రబాబు హయాంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. కానీ వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక మూడు రాజధానుల విధానం తీసుకొచ్చారు. అమరావతి.. శాసన రాజధానిగా.. కర్నూలు న్యాయ రాజధానిగా నిర్ణయించారు జగన్.

అందులో భాగంగా.. త్వరలో విశాఖలో పరిపాలన ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ టైమ్ లో కేంద్రం మాత్రం అమరావతే రాజధానిగా గుర్తించడంతో జగన్ సర్కార్ అయోమయంలో పడింది.