ఆ ఇంటికి ముద్దుల కొడుకు.. ఆ తాతకు గారాల మనవడు.. పైగా ఇంట్లో జరుగుతున్న చివరి పెళ్లి.. మధ్యతరగతి కుటుంబమే అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తుంది కదా.. మరి అదే అంబానీలయితే! ఇంకేంటి ఆకాశమంత పందిరి.. భూమంతా పీటలు వేసి పెళ్లి చేస్తారు. ప్రపంచం మొత్తం పెళ్లిలో ఉండేలా.. ప్రపంచమంతా పెళ్లి చేసేలా ఏర్పాట్లు చేస్తారు. అనంత్ అంబానీ వివాహ వేడుకలోనూ అదే జరుగుతోంది. పెద్దలు చెప్పినట్లు.. సినిమాల్లో చూసినట్లు.. మనం మరిచిపోలేనట్లు.. ఐదు రోజుల పెళ్లిని పరిచయం చేస్తోంది అంబానీ ఫ్యామిలీ. అద్భుతమే అవాక్కయ్యే రేంజ్‌లో పెళ్లి ఏర్పాట్లు చేశారు.. దేవుళ్ల పెళ్లి వేడుకలైనా.. ఇంత ఘనంగా జరిగేనా అన్నట్లు ఏర్పాట్లు చేశారు. ఆ సంగతులేంటో మీరూ చూడండి మరి..
అంబానీ వారి పెళ్లి సందడి పీక్స్‌కు చేరింది. ఈనెల 12న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జంట పవిత్ర బంధంతో ఒకటి కానున్నారు. ఏ నోట విన్నా ఈ పెళ్లి గురించే చర్చ. గుజరాత్ జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ ఉత్సవాల నుంచి ఇటలీలోని విలాసవంతమైన క్రూయిజ్ షిప్ వేడుక వరకు… ప్రతీ దాని గురించి ప్రపంచం మాట్లాడుకుంది. ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ. తన రెండో కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి ఖర్చుకు వెనకాడకుండా వైభవంగా చేస్తున్నారు. చిన్న కుమారుడనే ప్రేమ.. అస్తమాలాంటి అనారోగ్య సమస్యలను దాటి వచ్చాడన్న భావోద్వేగం.. ముఖేష్, నీతా అంబానీ కళ్లలో కనిపిస్తూ ఉంటుంది. అందుకే ముద్దుల చిన్న కొడుకు పెళ్లిని గ్రాండ్‌గా నిర్వహించాలని.. అంబానీ ఫ్యామిలీ డిసైడ్ అయింది. పెళ్లి పత్రిక నుంచి వివాహ వేదిక వరకు.. దుస్తుల నుంచి అతిథులకు వడ్డించే భోజనాల వరకు అన్నీ స్పెషలే. ఎంగేజ్‌మెంట్, ప్రీ వెడ్డింగ్‌నే ఓ రేంజ్‌లో చేసిన ముఖేష్ అంబానీ.. అనంత్ పెండ్లి వేడుకను కనీవినీ ఎరుగని రీతిలో చేసేందుకు రెడీ అయ్యారు. మరికొన్ని గంటల్లో అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ఒక్కటి కాబోతున్నారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో పెళ్లి అట్టహాసంగా నిర్వహించనున్నారు. స్వర్గమే భూలోకానికి దిగొచ్చిందన్న ఫీలింగ్ కలిగేలా.. తారాలోకం తరలిరానుంది. అతిరథ మహారథులు ఆశీర్విదించనున్నారు. టాప్ సింగర్లు తమ గాత్రంతో అలరించబోతున్నారు.
12న శుభ్ వివాహ్‌తో వేడుకలు స్టార్ట్ అవుతాయి. జులై 13న శుభ్ ఆశీర్వాద్, జులై 14న మంగళ్ ఉత్సవ్‌తో వివాహ తంతు ముగియనుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలతోనే పిచ్చెక్కించారు. ఇక పెండ్లి అంటే మినిమమ్ ఉంటుంది. ప్రీ వెడ్డింగ్‌లో 2 వేల 5వందల రకాల రుచులతో భోజనాలు పెట్టారు. ఇక పెళ్లిలో దాదాపు 3వేల రుచులు అతిథులకు వడ్డించేందుకు రెడీ అవుతున్నారు. దేశవిదేశీ ప్రముఖులు వస్తుండటంతో… భారతీయ రుచులతో పాటు, కాంటినెంటల్ వంటకాలన్నింటినీ మెనూలో చేర్చారు. ప్రపంచం నలుమూలల్లో దొరికే దాదాపు అన్ని రకాల ప్రధాన వంటకాల్ని అనంత్ అంబానీ పెళ్లిలో వడ్డించబోతున్నారు. వరల్డ్ క్లాస్ ఫుడ్ ఫెస్టివల్‌లా అన్నిరకాల వంటకాలు పెట్టనున్నారు. కేవలం భోజనాల కోసమే 230 కౌంటర్లు ఏర్పాట్లు చేస్తున్నారని టాక్. ఈ మధ్య పెళ్లి పత్రిక తీసుకొని నీతా అంబానీ.. కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్లివచ్చారు.
అక్కడ కాశీ ఛాట్ భండార్‌లో రుచులు ఆస్వాదించారు. అవి నచ్చడంతో, ప్రత్యేకంగా ఆ కౌంటర్‌ను కూడా అనంత్ పెళ్లి భోజనాల మెనూలో చేర్చారు. టిక్కీ ఛాట్, టమాట ఛాట్, పాలక్ ఛాట్, కుల్ఫీ ఇక్కడ ప్రత్యేకతలు. అంబానీల ఇంట పెళ్లి వేడుకలకు హాజరుకానున్న అతిథుల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. గెస్ట్‌లను వివాహ వేదిక దగ్గరకు తీసుకెళ్లేందుకు మూడు ఫాల్కన్ 2000 జెట్స్ సిద్ధం చేశారు. మొత్తం వేడుకలకు దాదాపు 100 వరకు ప్రైవేటు విమానాలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. వాల్డ్‌వైడ్‌గా 12వందల మంది అతిథులు పెళ్లి వేడుకకు హాజరుకాబోతున్నారు. పెళ్లి వేడుకలకు 320 మిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో 2వేల 6వందల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. అనంత్ పెళ్లికి బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్ రానున్నారని తెలుస్తోంది.
అమెరికన్ రియాలిటీ స్టార్లు కిమ్ కర్దాషియన్, ఖ్లో కర్దాషియన్, లైఫ్‌కోచ్ జేశెట్టి, యూఎస్ విదేశాంగశాఖ మాజీమంత్రి జాన్ కెర్రీ, స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిడ్త్, కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్, టాంజానియా అధ్యక్షుడు సామియ సులుహు హస్సన్, ఐఓసీ ఉపాధ్యక్షుడు జాన్ ఆంటోనియో, ఫిఫా అధ్యక్షుడు గియన్ని ఇన్‌ఫాంటినో లాంటి వారు రానున్నారు. ఇక బిజినెస్ రంగం నుంచి హెచ్‌ఎస్‌బీసీ ఛైర్మన్ మార్క్ టకర్, మోర్గాన్ స్టాన్లీ ఎండీ మైఖెల్ గ్రిమ్స్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఛైర్మన్ జేలీ, నోకియా ప్రెసిడెంట్ టామీ ఉయిటో సహా ఇంకా పలు ప్రపంచస్థాయి సంస్థల ఛైర్మన్‌లు, ఎండీలు, సీఈఓలు అంబానీల ఆతిథ్యం అందుకోనున్నారని తెలుస్తోంది.