విజయవాడలో (Vijayawada) స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో.. 125 అడుగుల భారీ అంబేద్కర్ (Ambedkar) విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. ఇప్పుడు పొలిటికల్ (Political) సర్కిల్స్ లో ఈ విగ్రహంపై హాట్ టాపిక్ గా మారింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జగన్ సర్కార్ వ్యూహాత్మకంగా సరిగ్గా.. ఎన్నికలకి మూడు నెలల ముందు అంబేద్కర్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ను ప్రారంభించారు. ఈ విగ్రహాన్ని అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీతో పోల్చారు జగన్. 125 అడుగుల విగ్రహం, దాని చుట్టూ మ్యూజియం ఇంత భారీ నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖర్చుపెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ ప్రాజెక్టుని అనుకున్న సమయానికి కచ్చితంగా పూర్తి చేయగలిగింది ఏపీ ప్రభుత్వం. YSR CP ఆశలన్నీ ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీల ఓట్ల పైనే. అంబేద్కర్ నామస్మరణ వెనుక, విగ్రహాల నిర్మాణం వెనక ఉన్న ఏకైక లక్ష్యం కూడా ఎస్సీ ఎస్టీలు ఓట్లే. మొదటినుంచి జగన్ ని ఆదుకుంటుంది కూడా ప్రధానంగా ఎస్సీ ఎస్టీలే. ఈసారి అదనంగా బీసీలు ఓట్లు బాగా కలిసి వస్తాయని వైసీపీ ఆశిస్తోంది.
ఇంతవరకు బాగానే ఉంది. తెలంగాణలో జనం తీర్పు చూస్తేనే ఏపీలో పరిస్థితిపై అందరికీ డౌట్ వస్తుంది. కెసిఆర్ సర్కార్ హైదరాబాదులో కూడా భారీగా అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించింది. దీని ప్రారంభానికి ఏకంగా అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ని తీసుకొచ్చారు కెసిఆర్. ఆ సందర్భంగా జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. అంతేకాదు దళిత బంధు పథకం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదంటూ గొప్పలు చెప్పుకున్నారు కేసీఆర్. అంబేద్కర్ సమత విగ్రహం నిజంగానే హైదరాబాదులో ఇప్పుడు ఒక ల్యాండ్ మార్క్ అయింది. ఆ విగ్రహం ప్రారంభించిన రెండు నెలలకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. అంబేద్కర్ విగ్రహం తనకి ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీల ఓట్లను విపరీతంగా రాబడుతుందనీ.. దానికి దళిత బంధు కార్యక్రమం కూడా తోడవుతుందని కెసిఆర్ చాలా ఆశలు పెట్టుకున్నారు.
దళితుడిని సీఎం చేస్తానని ప్రగల్బాలు పలికిన కెసిఆర్… ఆ పని చేయకుండా దళిత బంధు పెట్టి, అంబేద్కర్ విగ్రహం పెట్టి దళితుల కళ్ళకు గంతలు కట్టాలని ప్రయత్నించారు. ఆ పప్పులేమీ ఎన్నికల్లో ఉడకలేదు. కెసిఆర్ పెట్టిన అంబేద్కర్ విగ్రహం ఎస్సీ, ఎస్టీల ఓట్లను రాల్చలేకపోయింది. విగ్రహాన్ని చూసి ఆ మాయలో ఓట్లు వేసేస్తారు అనుకుంటే అంతకన్నా భ్రమ మరొకటి ఉండదని తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు నిరూపించారు. ఇప్పుడు చాలామంది ఏపీలో అదే డౌట్ పడుతున్నారు. ఏపీలో స్థాపించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఇండియాలోనే అతి పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ. మరి ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద విగ్రహం లేదు. ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహం చూసి ఎస్సీ, ఎస్టీలు వైసీపీకి అనుకూలంగా ఈ ఎన్నికల్లో ఓటు వేస్తారా? తెలంగాణలో ఎస్సీ ఎస్టీలు అంబేద్కర్ విగ్రహం చూసి, దళితులపై కెసిఆర్ ఔదార్యాన్ని చూసి ఓటు వేయనప్పుడు.. ఏపీలో మాత్రం అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన ఎస్సీ ఎస్టీలు జగన్ కి ఓటేస్తారా? ఇప్పుడు ఇదే సందేహం అందరిని వేధిస్తోంది. ఎన్ని పథకాలు ఇచ్చినా.. డబ్బులు ఇచ్చినా.. అంబేద్కర్ విగ్రహాలు పెట్టినా.. ఏపీలోని దళితులు YSR CPకి ఈసారి ఓటు వేస్తారా అన్నదే ఇప్పుడు అందరి ప్రశ్న. తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీలు ఉన్నప్పుడు.. ఏపీలో మాత్రం అనుకూలంగా ఎందుకుంటారు. అంబేద్కర్ విగ్రహాలను చూసి జనం ఓట్లు వేసే రోజులు ఇంకా ఉన్నాయా?