78ఏళ్ల స్వతంత్ర్య భారతం.. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ.. ప్రపంచానికి పెద్దన్న పాత్ర.. ఇవన్నీ రాతల్లో చూపించడానికి.. మాటల్లో చెప్పడానికి బాగానే ఉంటాయ్. కొన్ని సంఘటనలు, విషాదాలు.. స్వతంత్ర్య భారతం సిగ్గుపడేలా అనిపిస్తుంటాయ్. కనీస వసతులు లేక.. కనీసం చావు ప్రశాంతంగా చావలేక.. పడిన కష్టాలు, పడుతున్న ఇబ్బందులు.. ఎన్నో ఎన్నెన్నో! అలాంటి హృదయవిదారక ఘటనే చోటుచేసుకుంది మహారాష్ట్రలో. అది అలాంటి ఇలాంటి విషాదం కాదు.. మాటల్లో వర్ణించలేని దారుణం.
ప్రపంచంలో ఏ తల్లిదండ్రులకు రాకూడని వేదన అది. ఇద్దరు కొడుకులు ఒకేసారి చనిపోతే.. ఆ డెడ్‌బాడీలను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ లేకపోతే.. ఆ అమ్మానాన్న చెరొక మృతదేహాన్ని భుజాల మీద వేసుకొని 15 కిలోమీటర్ల దూరం నడిచి ఇంటికి చేరుకున్నారు. మనసులను మెలేస్తున్న ఈ తీవ్ర విషాద ఘటన… మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగింది. అహేరి ప్రాంతానికి చెందిన దంపతులకు ఈ దయనీయ పరిస్థితి ఎదురైంది. ఈ వీడియోను మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. ఇద్దరు అన్నదమ్ముళ్లు జ్వరంతో బాధపడ్డారు.
వారికి సకాలంలో చికిత్స అందలేదు. కొన్ని గంటల్లోనే వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆ తర్వాత ఇద్దరు చిన్నారులు చనిపోయారు. మైనర్ల మృతదేహాలను వారి గ్రామం పట్టిగావ్‌కు తరలించడానికి అంబులెన్స్ కూడా లేదు. తల్లిదండ్రులు వర్షంలో తడిసి బురదగా మారిన మార్గం గుండా 15 కిలోమీటర్ల మేర నడిచారు. గడ్చిరోలి వైద్య సంరక్షణ వ్యవస్థ ఎంత భయంకరంగా ఉందో వాస్తవికత ఈ రోజు మళ్లీ తెరపైకి వచ్చిందని విజయ్ సభసాక్షిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. భార్యభర్తలు చెరో మృతదేహాన్ని భుజాలపై వేసుకొని.. బురదగా ఉన్న మట్టి రోడ్డుపై అడవిలో నడిచి వెళ్లడం వీడియోలో ఉంది. ఇది ప్రతీ ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఐతే ఈ ఘటనపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. 78ఏళ్ల స్వతంత్ర్య భారతంలో ఇలాంటి చావులా.. ఇలాంటి బతుకులా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్.