అమెరికా అంటే బేస్ బాల్, బ్యాస్కెట్ బాల్ , ఒలింపిక్ స్పోర్ట్స్ మాత్రమే గుర్తొస్తాయి. అయితే గత కొంతకాలంగా అగ్రరాజ్యం క్రికెట్ ఫైనా ఫోకస్ పెట్టింది. తమ దేశంలో క్రికెట్ అభివృద్ధికి వేగంగా అడుగులు వేస్తోంది. దీని కోసం భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం చేతులు కలిపాడు. తాజాగా సచిన్ అమెరికా నేషనల్ క్రికెట్ లీగ్‌లో భాగస్వామిగా చేరాడు. దిగ్గజ ఆటగాడి రాకతో తమ దేశంలో క్రికెట్‌కు మహర్ధశ పట్టనుందని అమెరికా బోర్డు భావిస్తోంది. సచిన్ సైతం కొత్త బాధ్యతల్లో ఒదిగిపోయేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాని చెప్పాడు. ఇదిలా ఉంటే 10 ఓవర్ల ఫార్మాట్ అయిన నేషనల్ లీగ్ టోర్నమెంట్ అట్టహాసంగా మొదలైంది. ఈ టోర్నీలో ప్రస్తుతం ఆడుతున్న వాళ్లతో పాటు వీడ్కోలు పలికిన క్రికెటర్లు సైతం బరిలోకి దిగుతున్నారు. వెటరన్ ఆటగాళ్లు గవాస్కర్, వసీం అక్రమ్, వివ్ రిచర్డ్స్, వెంకటేశ్ ప్రసాద్, జహీర్ అబ్బాస్, సనత్ జయసూర్య వంటి వాళ్ళు ఆడనున్నారు.