వరల్డ్ కప్ 2023లో తలపడబోయే భారత జట్టును.. బీసీసీఐ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంపికైన 15 మంది పేర్లను వెల్లడిస్తూ.. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 కోసం ఎంపిక చేయబడిన టీమిండియా స్క్వాడ్ ఇదిగో.. అని ట్వీట్ చేసింది. ఈ ప్రకటన వెలువడిన నిమిషాల వ్యవధిలోనే టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ఇండియా పేరును భారత్‌గా మారుస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా కాదు.. టీమ్ భారత్ అనండి అని వీరూ ఈ ట్వీట్ చేశాడు.
ఈ మేరకు ఆటగాళ్లు ధరించే జెర్సీపై ‘భారత్’ అని ముద్రించాలని బీసీసీఐ అధ్యక్షుడు జై షాను కోరాడు. “టీమిండియా కాదు.. టీమ్ భారత్. ఈ వరల్డ్ కప్‌లో మనం కోహ్లి, రోహిత్, బుమ్రా, జడేజాలాంటి వాళ్లను చీర్ చేస్తున్నప్పుడు మన గుండెల్లో భారత్ అని ఉండాలి. అంతేకాదు ఆటగాళ్లు భారత్ పేరున్న జెర్సీలను వేసుకోవాలి.. ” అని బీసీసీఐ సెక్రటరీ జై షాను వీరూ ట్యాగ్ చేశాడు. మరో పోస్ట్ లో సెహ్వాగ్.. బ్రిటీష్ వాళ్లు ఇండియా అనే పేరు ఇచ్చారని, మనం ఎప్పుడూ భారతీయులమే అని పేర్కొనడం గమనార్హం. ఇండియా పేరును భారత్‌గా మార్చడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం కాబోతోందన్న వార్తల నేపథ్యంలో సెహ్వాగ్ చేసిన ఈ పోస్ట్ తెగ వైరలవుతోంది.