సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణలో.. తెలంగాణ ఆత్మగౌరవం, సుభిక్ష తెలంగాణ, ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల ఆకాంక్షలకు భిన్నంగా పాలన కొనసాగుతోందని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. హైదరాద్ కత్రియా హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 30 నవంబర్ నాడు తెలంగాణ ఎన్నికల్లో.. బీజేపీకి బంపర్ మెజారిటీ ఇవ్వాలని ప్రజలను కోరారు మీ నిర్ణయం ప్రభుత్వం, మీ ఎమ్మెల్యే కోసమో కాదు.. మీ ఓటు తెలంగాణ భవిష్యత్తును, దేశ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుందన్నారు అమిత్ షా. బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. మియాపూర్ భూకుంభకోణం, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, ఔటర్ రింగ్ రోడ్డు టోల్, మద్యం కుంభకోణం.. గ్రానైట్ కుంభకోణం ఇలా చాలా స్కామ్స్ జరిగాయన్నారు అమిత్ షా. బీఆర్ఎస్ కార్యకర్తలు.. డబుల్ బెడ్రూం, దళితబంధు పథకాల్లో కమీషన్లు నొక్కారు. ఇచ్చిన ఏ హామీనీ కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చలేదు. ఫిల్మ్ సిటీ, ఫార్మా సిటీ, టెక్స్ టైల్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ లాంటి హామీలన్నీ ఉత్తుత్తివే అని తేలిపోయిందని ఎద్దేవా చేశారు అమిత్ షా. సిటీలు ఎక్కడా కనిపించవు. కానీ సిటీ పేరుతో కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు, పార్టీ భూములను కబ్జా చేసుకుందని హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు
బీజేపీ చెప్పింది చేసింది
రామమందిరం, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 ఏదైనా ఇచ్చిన హామీలు తాము పూర్తిచేశామన్నారు అమిత్ షా. కేసీఆర్ ప్రభుత్వం మత రాజకీయాలకు పాల్పడుతూ.. రాజ్యాంగ విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్లు ఇస్తోంది. 4% రిజర్వేషన్లు తొలగించి.. వాటిని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పంచుతామన్నారు అమిత్ షా. అల్లర్లు జరిగినప్పుడు మైనారిటీల పేర్లు పబ్లిష్ చేయొద్దంటూ ప్రభుత్వం పత్రికలకు సూచించడం తానెక్కడా వినలేదని అన్నారు హోంమంత్రి అమిత్ షా. మోడీ ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గిస్తే.. బీజేపీ పాలిత రాష్ట్రాలు చాలా వరకు ధరలు తగ్గించి పేదలపై భారాన్ని తగ్గించాయి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వ్యాట్ తగ్గించలేదు. బీజేపీ అధికారంలోకి రాగానే.. వ్యాట్ తగ్గిస్తామని హామీ ఇచ్చారు అమిత్ షా.
పీవీ నరసింహారావుని కాంగ్రెస్ అవమానించింది. అంజయ్యని అవమానించింది. కాంగ్రెస్ తీరు ఇదే. తెలంగాణను అవకాశం దొరికినప్పుడు అవమానించడం కాంగ్రెస్ కు అలవాటే అన్నారు అమిత్ షా. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరి ఆలోచన ఒక్కటే. వారిద్దరూ ఒక్కటే అని ఆరోపించారు. తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసే బాధ్యత బీజేపీది. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 మధ్యలో ఉమ్మడి ఏపీలో 2 లక్షలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఇస్తే.. ఈ పదేళ్ల లో మా ప్రభుత్వం ఒక్క తెలంగాణకే.. 2.5 లక్షలకోట్లు ఇచ్చామన్నారు అమిత్ షా. హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉన్నారని తెలిస్తే మేం చూస్తూ ఊరుకోలేదు. ఎన్ఐఏ విచారణ చేస్తోంది. ఒవైసీ, బీఆర్ఎస్ కు రోహింగ్యాలు ఓటు బ్యాంకు . మాకు మాత్రం వాళ్ళు దేశ ద్రోహులే అన్నారు అమితష్ షా