Bangalore Cab Driver: అమ్మాయిపై అఘాయిత్యానికి ప్రయత్నించిన ఉబర్ డ్రైవర్.. క్యాబ్ డ్రైవర్ కాదు వీడు కామ రైడర్

ఇది ఉరుకుల పరుగుల యాంత్రిక యుగం. ఇక్కడ ప్రతి ఒక్క పని తనకు తాను సొంతంగా చేసుకోవడం కంటే కూడా ఇతర ప్రత్యమ్నాయాల వైపుకు చూస్తూ ఉంటారు. అందులో మొదటిది క్యాబ్ అని చెప్పాలి. ఈ క్యాబ్ ద్వారా ఒక హేయమైన చర్య తాజాగా బెంగళూరులో చోటు చేసుకుంది. ఓ క్యాబ్ డ్రైవర్ చరనుంచి ఒక మహిళ ధైర్య సాహసాలకు పోరాడి బయటపడ్డారు.

  • Written By:
  • Updated On - June 22, 2023 / 09:53 PM IST

సరదాగా కావచ్చు, పనిమీద కావచ్చు బయటకు వెళ్ళాలంటే రాపిడో, ఓలా, ఉబర్ వంటి క్యాబ్ లను బుక్ చేసుకుంటారు. కొద్దిగా ఆర్థికస్థితి తక్కువ ఉన్న వాళ్లయితే బైక్ బుక్ చేసుకుంటారు. ఇది అన్ని మెట్రో నగరాల్లో అందుబాటులో ఉండే తక్షణ సేవ. మన ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రస్తుత లొకేషన్ నుంచి డెస్టినేషన్ ఎంటర్ చేస్తే చాలు రైడ్ ఆన్ అవుతుంది. నిమిషాల వ్యవధిలో కారు లేదా బైక్ డ్రైవర్ వచ్చి మనల్ని రిసీవ్ చేసుకుంటారు. ఇది సద్వినియోగం చేసుకుంటే దీనికి మించిన రవాణా సౌకర్యం మరొకటి ఉండదు. కానీ వీటిని వక్రమార్గాల్లో ఉపయోగించుకుంటున్నారు కొందరు. ఇలా ఉపయోగించుకుంటున్న వాళ్ళకంటే కూడా అమర్యాదపూర్వక ప్రవర్తనతో కొందరు డ్రైవర్లు ప్రవర్తిస్తున్న తీరు క్యాబ్ ఎక్కాలంటే భయం కలిగేలా చేస్తుంది.

బెంగళూరుకు చెందిన ఒక మహిళ బీఎటీఎం సెకండ్ స్టేజి నుంచి జేపీ నగర్ మెట్రో వరకూ రవాణా సదుపాయానికి ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నారు. డ్రైవర్ లొకేషన్ కి వచ్చి ఎక్కించుకున్న కొద్ది సేపటికే ఒంటరిగా ఉన్న మహిళను అదునుగా భావించి రైడ్ రూట్ లో కాకుండా వేరే రూట్ లో ప్రయాణం చేయడం ప్రారంభించాడు. దీనిని గమనించిన సదరు ప్రయాణికురాలు యాప్ కస్టమర్ కేర్ కి ఫిర్యాదు చేశారు. దీంతో మళ్లీ సరైన మార్గం గుండా ప్రయాణం సాగించాడు డ్రైవర్. కొంత దూరం తరువాత డ్రైవర్ ప్రవర్తన మీద అనుమానం కలిగి గమ్యస్థానం కంటే ముందుగానే రైడ్ కి సంబంధించిన డబ్బులు చెల్లించి ఆపేయమని అన్నారు.

డబ్బులు తీసుకున్న తరువాత క్యాబ్ డ్రైవర్ తనలోని రాక్షసత్వాన్ని బయట పెట్టాడు. ఆ మహిళ శరీరంలోని ప్రైవేట్ భాగాలను తాకేందుకు ప్రయత్నించాడు. దీనిని నిలువరించే ప్రయత్నం చేశారు ఆ మహిళ. ఎంతటికీ బాధితురాలు సహకరించకపోవడంతో ఆమెపై చేయి చేసుకున్నాడు క్యాబ్ డ్రైవర్. చివరకు అతని అకృత్యాలను ప్రతిఘటించి కారులోనుంచి బయటకు దిగి జనసంచారం ఉండే ప్రదేశానికి పరుగులు పెట్టి తనను తాను కాపాడుకున్నారు. కాసేపు ఆలస్యం చేసి ఉన్నా.. ఏ కొంచెం ఏమరపాటుగా ఉన్నా మరో స్త్రీ మూర్తి దేహం క్యాబ్ నడిపే కామాంధుడికి బలైపోయేది.

Bangalore Uber Cab Driver

తనకు ఎదురైన ఈ అనుభవాన్ని వెంటనే లింక్ డిన్ లో పోస్ట్ చేశారు బాధిత మహిళ. ఈ సంఘటన నుంచి తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో విలువైన వస్తువులను కారులోనే వదిలేసినట్లు తెలిపారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉబర్ వెంటనే స్పందించి సదరు క్యాబ్ డ్రైవర్ పై క్రమశిక్షణా ఉల్లంఘన చర్యలు చేపట్టింది. మహిళలపై అతని పైశాచికత్వానికి ఉబర్ క్షమాపణలు తెలిపి సదరు డ్రైవర్ ని ఉద్యోగం నుంచి తొలగించింది. తాను పోస్ట్ పెట్టిన వెంటనే స్పందించిన ఉబర్ సర్వీస్ టీం కి బాధితురాలు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి చర్యలు మరోసారి ఏ ఒక్కరికీ జరుగకుండా చర్యలు తీసుకోమని కోరారు.

దీనిపై ఉబర్ స్పందిస్తూ తప్పకుండా మీరు చెప్పిన సూచనలను పాటిస్తామని బదులిచ్చింది. దీంతో పాటూ ఒంటరిగా ప్రయాణం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోమని బదులిచ్చింది. తమ ప్రయాణాన్ని ఒంటరిగా కాకుండా పలువురితో షేర్ చేసుకోమని, దీంతో పాటూ తమ యాప్ లోని రైడ్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోమని వివరించింది. అలాగే ఉబర్ యాప్ లో 3.0 వంటి ఫీచర్లను వినియోగించుకోవాలని సూచించింది. సమస్య తీవ్రంగా ఉంటే కస్టమర్ కేర్ లేదా పోలీసులకు కాల్ చేయమని తెలిపింది.

ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావతం కాకుండా ఉండాలంటే డ్రైవర్ ఎంపిక విషయంలో మరిన్ని కఠినమైన పరీక్షలు పెట్టి నియమించుకోవాలని కోరుతున్నారు ప్రజలు. ఇలా ప్రతి ఒక్కరూ సాంకేతికతను అందిపుచ్చుకోలేరు కనుక విచక్షణ కలిగిన వారికి మాత్రమే కారు డ్రైవర్లుగా తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే వారికి సంబంధించిన పూర్తి వివరాలను, క్యాబ్ డ్రైవర్తోపాటూ అతని బంధువులు, స్నేహితుల వివరాలను కూడా క్యాబ్ ప్రొవైడర్ కంపెనీలు నమోదు చేసుకోవాలంటున్నారు. వీరి నంబర్లను పోలీస్ స్టేషన్లలో ట్రాకింగ్ సిస్టం కి కనెక్ట్ చేయాలని సూచిస్తున్నారు. అప్పుడే ఇలా చేస్తే మనం ఎక్కడికీ తప్పించుకోలేం. మన ఇంట్లోవాళ్లకు సమస్యలు వస్తాయన్న ఆలోచనతో ఇలాంటి సంఘటనలను కొంత వరకూ నివారించవచ్చని తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

 

T.V.SRIKAR