Anant ambani pre wedding: అంబానీ ఇంట పెళ్లి వేడుక.. 51 వేల మందికి అన్నసేవ.. 2,500 రకాల వంటలు

వీరి వివాహ వేడుక మార్చి 1 నుంచి మూడు రోజులపాటు జరగనుంది. దీనికి సంబంధించి ముందస్తు వేడుక.. అంటే ప్రి వెడ్డింగ్ ఫంక్షన్‌ గుజరాత్‌లోని జామ్ నగర్‌లో ప్రారంభమైంది. దీనిలో భాగంగా బుధవారం రాత్రి అంబానీ కుటుంబం.. 51 వేల మందికి అన్నసేవ కార్యక్రమం నిర్వహించింది.

  • Written By:
  • Publish Date - February 29, 2024 / 04:33 PM IST

Anant ambani pre wedding: దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ రెండో తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్‌ను పెళ్లి చేసుకోబోతున్నారు. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ CEO వీరెన్ మర్చంట్, వ్యవస్థాపకురాలు శైలా మర్చంట్ చిన్న కుమార్తె రాధిక. వీరి వివాహ వేడుక మార్చి 1 నుంచి మూడు రోజులపాటు జరగనుంది. దీనికి సంబంధించి ముందస్తు వేడుక.. అంటే ప్రి వెడ్డింగ్ ఫంక్షన్‌ గుజరాత్‌లోని జామ్ నగర్‌లో ప్రారంభమైంది. దీనిలో భాగంగా బుధవారం రాత్రి అంబానీ కుటుంబం.. 51 వేల మందికి అన్నసేవ కార్యక్రమం నిర్వహించింది. జోగ్వాడ్ గ్రామంలోని స్థానికులకు గుజరాతీ సంప్రదాయ విందు ఏర్పాటు చేశారు.
విదేశీ ప్రముఖుల రాక
అంబానీ ఇంట పెళ్లికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. ఖతార్ ప్రధాని మహ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ, భూటాన్ క్వీన్ జెట్సన్ పెమా, స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిల్డ్, మైక్రోసాఫ్ట్ సీఈవో బిల్ గేట్స్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్, మోర్గాన్ స్టాన్లీ సీఈఓ టెడ్ పిక్, కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్, మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, బొలీవియా మాజీ అధ్యక్షుడు జార్జ్ క్విరోగా, లెఫ్టినెంట్ డిస్నీ సీఈఓ బాబ్ ఇగర్, సౌదీ ఆరామ్ కొ చైర్ పర్సన్ యాసిర్ అల్ రుమయ్యన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా చైర్మన్ బ్రియాన్ థామస్ మొయినిహాన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం చైర్ పర్సన్ క్లాస్ ష్వాబ్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రుడ్ తదితరులను అంబానీ ఆహ్వానించారు. అలాగే బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖ క్రికెటర్లు, క్రీడాకారులు, దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు కూడా హాజరవ్వబోతున్నారు. వీళ్లంతా పెళ్లికి హాజరవుతుండటంతో ఘనమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపట్టారు.
2,500 రకాల వంటలు
ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుక అంటే విందు కూడా మామూలుగా ఉండదు. ఈ పెళ్లి వేడుకల కోసం దాదాపు 2,500 రకాల వంటలు సిద్ధం చేయనున్నారు. దాదాపు 60 మందికి పైగా చెఫ్‌ల బృందం, వందల మంది సిబ్బంది వంటల కోసం పని చేస్తారు. పార్సీ, థాయ్, మెక్సికన్, జపనీస్, చైనీస్, ఇండోరీ ఫుడ్ వడ్డించబోతున్నారు. మూడు రోజుల వ్యవధిలో మొత్తం 2,500 వంటకాలు మెనూలో ఉంటాయి. స్నాక్స్, బ్రేక్‌ఫాస్ట్ కోసం 70 కంటే ఎక్కువ వంటలు సిద్ధం చేయిస్తున్నారు. అతిథులకు శాఖాహార వంటకాల కోసం ప్రత్యేక ఏర్పాటు కూడా ఉంది.