Liquor Shops: తెలంగాణలో మద్యం షాపుల కోసం ఏపీ రియల్ ఎస్టేట్ కంపెనీ భారీ పెట్టుబడి!

రియల్ ఎస్టేట్ సంస్థలు తెలంగాణ లిక్కర్ వ్యాపారం వైపుగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.

  • Written By:
  • Publish Date - August 26, 2023 / 12:39 PM IST

తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం పోటీ మామూలుగా లేదు. ఇందుకోసం భారీగా పోటెత్తిన అప్లికేషన్ల వ్యవహారం ఓ వైపు ఆశ్చర్యాన్ని.. మరోవైపు అనుమానాన్ని రేకెత్తిస్తోంది. ఏదైనా ఒక సంస్థ మద్యం దుకాణం లైసెన్సు కోసం గరిష్ఠంగా 20 లేదా 50 అప్లికేషన్లు పెట్టినా అనుమానం వస్తుంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌ లోని వైజాగ్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే ఒక సంస్థ
హైదరాబాద్‌ శివారు ప్రాంతాలు, శంషాబాద్‌, సరూర్‌నగర్‌ ఎక్సైజ్‌ జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాల కోసం ఏకంగా 5వేల అప్లికేషన్లు చేసిందని ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో అప్లికేషన్ కు రూ.2 లక్షల నాన్‌-రిఫండబుల్‌ రుసుమును కట్టాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఆ ఒక్క సంస్థే 5వేల అప్లికేషన్లకు రూ.100 కోట్లు ఖర్చు చేసింది. దీంతో ఇంత భారీ నగదుకు లెక్కలు ఉన్నాయా ? మనీలాండరింగ్ ఏదైనా జరిగిందా ? బ్లాక్ మనీ వ్యవహారం దాగి ఉందా ? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి అనుమానాస్పద లావాదేవీల తరుణంలో దర్యాప్తు అవసరం ఉంటుందని అంటున్నారు. ఏదిఏమైనప్పటికీ ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు లక్కీ డ్రాలో 110కిపైగా మద్యం దుకాణాలు దక్కడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపుతోంది.

గతంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా 68,691 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. వ్యాపారులకు సగటున 20 శాతం మార్జిన్‌ వస్తుండటంతో ఈసారి అంతకు రెట్టింపు స్థాయిలో 1,31,490 అప్లికేషన్లు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలోకి ఈ అప్లికేషన్ ఫీజు రూపంలో రూ.2,629 కోట్లు జమయ్యాయి. కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన వ్యాపారులు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాపై గురిపెట్టారు. ముఖ్యంగా గద్వాల ప్రాంతంలోని దుకాణాలు దక్కించుకునేందుకు పోటీపడ్డారు. వాళ్లు గ్రూపుగా ఏర్పడి దాదాపు 800 దరఖాస్తులు వేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యాపారులు కొత్తగూడెం ప్రాంతంలో దుకాణాల కోసం పోటీపడ్డారు. నెల్లూరుకు చెందిన కొందరు వ్యాపారులు మంచిర్యాల ప్రాంతంలోని మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు దరఖాస్తు చేశారు. శేరిలింగంపల్లిలోని ఓ మద్యం దుకాణంలో క్రితం సారి పాలసీ కాలంలో ఏకంగా రూ.80 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రతి దుకాణంలో సగటున రూ.20 కోట్లకుపైగా అమ్మకాలు జరిగాయి.

సెప్టెంబరు 15-18 మధ్య ఎప్పుడైనా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. అందుకే ఎన్నికల కంటే ముందే సాధ్యమైనంత ఎక్కువ రాబడిని సంపాదించాలన్నది ఎక్సైజ్‌ శాఖ ఉద్దేశంగా కనిపించింది. అందుకే ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్సు గడువు నవంబరు 30 వరకు ఉన్నా.. ముందుగానే కొత్త లైసెన్సులను జారీ చేశారని తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్తగా ప్రకటించే సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధులను ఈవిధంగా కేసీఆర్ సర్కారు సమకూర్చుకుందని అంటున్నారు. ఏదిఏమైనప్పటికీ డిసెంబరు 1 నుంచి కొత్త దుకాణాలు అందుబాటులోకి వస్తాయి. ఆలోగానే పాత షాపుల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ ఆదాయం పిండుకోవాలని కేసీఆర్ సర్కారు ప్లాన్ చేస్తోంది.