Tirumala: తిరుమల మెట్ల మార్గంలో చిక్కిన మరో చిరుత.. ఆపరేషన్ టైగర్ నిరంతరం కొనసాగుతుందన్న భూమన

అలిపిరి నడకమార్గంలో నరసింహ స్వామి గుడి వద్ద ఐదవ చిరుతన బోనులో చిక్కినట్లు గుర్తించారు.

  • Written By:
  • Publish Date - September 7, 2023 / 01:01 PM IST

తిరుమల నిత్యం లక్షల మంది యాత్రికులు శ్రీవారి దర్శనార్థం కొండపైకి చేరుకుంటారు. అందులో అధికశాతం మంది భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గం గుండానే వస్తూ ఉంటారు. గతంలో నడక మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఒక చిన్నారిని పొట్టన పెట్టుంకుంది. దీంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. యుద్ద ప్రాతిపధికన సహాయక, రక్షణ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా భక్తులకు టీటీడీ కొన్ని సూచనలు చేసింది. మెట్ల మార్గంలో నడిచే భక్తులకు చేతి కర్రలను అందిస్తామని తెలిపింది. గుంపులు గుంపులుగా 200 వందల మందిని ఒకసారి వదిలేలా ఏర్పాట్లు చేసింది.

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే భూమన కరుణాకర్ రెడ్డి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై కొంతమంది విమర్శించారు. అయినా తన ప్రణాళికలను ఆచరణలోకి తీసుకొచ్చి పెద్ద పెద్ద బోనులను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా వన్య ప్రాణులను ట్రాప్ చేసేందుకు కెమెరాలన అమర్చారు. ఇప్పటికే నాలుగు చిరుతలను బంధించారు. నాలుగు రోజుల క్రితమే కెమెరాలో చిరుత సంచారాన్ని గుర్తించారు. ఆ ప్రాంతలో టీటీడీ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు ప్రత్యేక బోను ఏర్పాటు చేయడంతో తాజాగా మరో మగ చిరుత చిక్కింది. నరసింహస్వామి ఆలయ సమీపంలోని ఏడవ మైలురాయి వద్ద చిరుత బోనులో చిక్కింది. దీనిని క్వారంటైన్ కు తరలిస్తాం అని డివిజనల్ ఫారెస్ట్ అధికారి సతీష్ రెడ్డి తెలిపారు.

ఇప్పటి వరకూ రెండు సార్లు చిరుతల దాడి చేసినట్లు గుర్తించారు. ఆ దాడి చేసిన చిరుత శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపారు. రిపోర్టుల ఆధారంగా వాటి గోర్లు, అడుగులు ఆధారంగా పెద్ద చిరుతా, లేక చిన్న పిల్లనా అని అంచనా వేస్తామన్నారు. ఆపరేషన్ చిరుత నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు భూమన. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా 300 మంది అటవీశాఖ సిబ్బందితో కలిసి టీటీడీ అధికారులు పనిచేస్తున్నట్లు చెప్పారు. నడకమార్గంలో వచ్చే భక్తులకు వన్యప్రాణుల సంచారం లేకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. రెండు నడకమార్గాల్లో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు వివరించారు. భక్తులకు భద్రత కల్పించడంలో టీటీడీ రాజీపడదని ఈ సందర్భంగా మరోసారి తెలిపారు.

T.V.SRIKAR