Jeevan Reddy : ఆర్మూర్ పాండుకు ఇంకో సెగ.. మా జిల్లాకు వద్దంటున్న కేడర్

నిజామాబాద్ జిల్లా BRS అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అసమ్మతి సెగ తగిలింది. కేసీఆర్ హయాంలో చేసిన స్కామ్స్ ఈమధ్యే ఒక్కోటి బయటకు వస్తున్నాయి. దీనికి తోడు అసలు పార్టీకి ఇలాంటి జిల్లా అధ్యక్షుడు ఉంటే మళ్ళీ BRS ఎదగడం కష్టమే అని మండిపడుతున్నారు గులాబీ పార్టీ కేడర్. జిల్లాలోని పార్టీని పట్టించుకోవడం లేదు. కనీసం జిల్లాలో నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో సమీక్ష కూడా చేయట్లేదు.

 

 

 

నిజామాబాద్ జిల్లా BRS అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అసమ్మతి సెగ తగిలింది. కేసీఆర్ హయాంలో చేసిన స్కామ్స్ ఈమధ్యే ఒక్కోటి బయటకు వస్తున్నాయి. దీనికి తోడు అసలు పార్టీకి ఇలాంటి జిల్లా అధ్యక్షుడు ఉంటే మళ్ళీ BRS ఎదగడం కష్టమే అని మండిపడుతున్నారు గులాబీ పార్టీ కేడర్. జిల్లాలోని పార్టీని పట్టించుకోవడం లేదు. కనీసం జిల్లాలో నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో సమీక్ష కూడా చేయట్లేదు. పాండును వెంటనే మార్చేయండి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మొరపెట్టుకుంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు.

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి చక్రం తిప్పారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో మాజీ అయ్యారు. అయితే ఆయన అప్పట్లో చేసిన స్కామ్స్ ఒక్కోటి ఇప్పుడు బయటపడుతుండటంతో.. బీఆర్ఎస్ కేడర్ లో టెన్షన్ మొదలైంది. అసలే నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు రాలేదు. ఇప్పుడు ఈయన గారిని ముందు పెట్టుకొని లోక్ సభ ఎన్నికలకు ఎలా వెళ్తామని బీఆర్ఎస్ కేడర్ ప్రశ్నిస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు కూడా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆర్మూరు పాండును తప్పించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలో మొత్తం 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో గెలిచింది ఒక్క బాల్కొండ మాత్రమే. అది కూడా ముక్కి మూలిగి మూడు వేల ఓట్ల మెజారిటీతో. ఇక మిగతా నియోజకవర్గాల్లో ఘోరంగా ఓడిపోయారు గులాబీ పార్టీ అభ్యర్థులు. పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోతే.. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జీవన్ రెడ్డికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదా.. పార్టీ ఓటమికి బాధ్యత వహించడా.. రివ్యూ మీటింగ్ అయినా పెట్టడా.. అని గరం గరం అవుతున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. పార్టీని వదిలేసి సొంత వ్యాపారాలు చేసుకుంటున్నాడనీ.. ఆయన మాట తీరు, యవ్వారం ఇలాగే ఉంటే.. జిల్లాలో పార్టీ బతకడం కష్టమని చెబుతున్నారు.

నిజామాబాద్ జిల్లా సంగతేమో గానీ.. ఆర్మూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి కూడా జీవన్ రెడ్డిని తప్పించాలన్న డిమాండ్ కార్యకర్తల నుంచి వస్తోంది. ఆర్మూర్ మున్సిపల్ ఛైర్ పర్సన్ పై సొంత పార్టీ నేతలే అవిశ్వాస తీర్మానం పెట్టారు. మొన్నా మధ్య నిజామాబాద్ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్స్ కూడా జీవన్ రెడ్డిని ఉద్దేశించినవే అంటున్నారు. జిల్లాలో నేతలు, కేడర్ తనను కలవనీయకుండా కొందరు కట్టడి చేశారని ఆమె కామెంట్ చేశారు. పార్టీ ఓడిపోవడానికి అలాంటి వాళ్ళే కారణమన్నారు. అది జీవన్ రెడ్డి గురించే అంటున్నారు. అందుకే ఆర్మూర్ పాండును జిల్లా అధ్యక్ష స్థానం నుంచి.. ఆర్మూర్ ఇంఛార్జ్ పదవి నుంచి దించకపోతే.. తామే వేరే ఏదైనా పార్టీ చూసుకుంటామని బీఆర్ఎస్ హైకమాండ్ కు అక్కడి లీడర్లు గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. ఏదైనా లోక్ సభ ఎన్నికల లోపే నిర్ణయం తీసుకోవాలని డెడ్ లైన్ కూడా పెట్టారు.