Minor Girl: మైనర్ బాలికపై లైంగికదాడి.. నిందితుడిని నిర్థోషిగా తేల్చిన కోర్టు..

లైంగిక వేధింపులు ఇవి మనదేశంలోనే కాదు ప్రపంచమంతటా ఏదో ప్రదేశంలో జరుగుతూనే ఉంటాయి. పసివాళ్ల మొదలు పండు ముసలి వాళ్లను కూడా ఆకతాయిలు వదలడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయకోసం ఆశ్రయిస్తారు కొందరు బాధితులు. కానీ అక్కడ కూడా అన్యాయం జరిగితే ఇక ఎవరికి చెప్పుకుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే రోమ్ నగరంలో చోటు చేసుకుంది. కేవలం 10 సెకండ్ల కంటే తక్కువ సమయం మాత్రమే ఆ బాలికను తాకాడని అతనిని నిర్ధోషిగా తేల్చింది. ఈ తీర్పు ఇప్పుడు ప్రపంచమంతటా హాట్ టాపిక్ గా మారింది.

  • Written By:
  • Publish Date - July 15, 2023 / 01:26 PM IST

ఇటలీలోని 17 ఏళ్ల బాలిక పై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు పాఠశాలలోని కేర్ టేకర్. ఈమె రోమ్ నగరంలోని ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఒక రోజు తన ఫ్రెండ్స్ తో కలిసి క్లాస్ రూం మెట్లు ఎక్కుతున్నారు. ఆ సమయంలో 66 సంవత్సరాల ఆంటోనియా అవోలా తనను లైంగికంగా బాధించాడని గత ఏడాది ఏప్రిల్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు మైనర్ బాలిక. తన వెనుక భాగాన్ని తాకుతూ.. చేతులతో తడుముతూ అసౌకర్యానికి గురిచేసినట్లు చెప్పారు. అలాగే తన లోదుస్తులను పట్టుకొని కిందకు లాగే ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. ఇంతటితో ఆగకుండా తనను పైకి ఎత్తుకునే ప్రయత్నం చేశాడని దీంతో భయాందోళనకు గురై అక్కడి నుంచి పరిగెత్తినట్లు వివరించారు. కేర్ టేకర్ ఇలా తనపై అసభ్యకరంగా ప్రవర్తించి కేవలం జోక్ చేశానని చెప్పినట్లు భాదితురాలు పోలీసులకు తెలిపారు.

దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఆంటోనియోను అక్కడి స్థానిక కోర్టులో హాజరు పరిచారు. దీనిపై న్యాయమూర్తి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై నిందితుడు స్పందిస్తూ తాను ఇలా ప్రవర్తించిన మాట వాస్తవమేనని అంగీకరించాడు. అయితే కేవలం ఉద్దేశ్యపూర్వకంగానో కామవాంఛతోనో ఈ ఘాతుకానికి పాల్పడలేదని న్యాయస్థానానికి తెలిపాడు. వాదోపవాదలు, తీవ్ర చర్చలు జరిపిన న్యాయస్థానం అతడిని నిర్థోషిగా తేల్చింది. ఈ సందర్భంగా కోర్ట్ ఈ కేసులో ఈ విధంగా వివరణ ఇచ్చింది. “కామవాంఛతో తాను ఈ పనిచేయలేదని, కేవలం సరదాగా ఆటపట్టించడానికి చేసినట్లు నిందితుడి వాదనతో మేము ఏకీభవిస్తున్నాం. పైగా అతను ఆ అమ్మాయిని తాకిన సమయం కూడా చాలా తక్కువ. కేవలం 5 నుంచి 10 సెకన్లలోపే ఉంది. దీనిని నేరంగా పరిగణలోకి తీసుకుంటే అనాలోచితమే అవుతుందని” అందుకే ఇతనిని నిర్థోషిగా తేలుస్తూ తీర్పునిచ్చినట్లు వెల్లడించింది.

కోర్టు ఈవిధమైన తీర్పును వెలువరించడం పై సర్వత్రా ఆందోళనలు వెల్లువెత్తాయి. న్యాయంగా తీర్పునివ్వాల్సిన న్యాయస్థానాలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదం అయ్యింది. అమ్మాయిని తాకడం వేరు.. ఇలా లైంగికంగా టచ్ చేయడం వేరు. తప్పు చేసి 5 సెకన్లు, 10 సెకన్లు అని సమయాన్ని పరిగణలోకి తీసుకోవడం చాలా హాస్యాస్పదంగా భావిస్తున్నారు. అంటే ఇంత నిర్ధిష్ట కాలపరిమితి ఏమైనా ఉంటుందా అమ్మాయి మానానికి.. ప్రాణానికి అని ఈ కొలమానం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిని అదనుగా చేసుకొని 10 సెకన్ల లోపు ఎవరైనా ఇలా ఆకతాయి చేష్టలకు పాల్పడితే పరిస్థితి ‎ఏంటని కోర్టు తీర్పుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

అమ్మాయి విషయంలో ఇటలీ కోర్డులు ఇలా ప్రవర్తించడం చాలా హేయమైనదిగా చెప్పాలి. మైనర్ బాలిక విషయంలో ఇలా ప్రవర్తించడాన్ని కచ్చితంగా నేరంగా పరిగణించాలి. నేరం చేసిన విధానాన్ని చూడకుండా సమయాన్ని తీసుకోవడం చాలా తప్పుగా భావించాలి. ఇదే 10 సెకన్ల లోపు లైంగిక దాడి తమ ఇంట్లోని వారిపై జరిగితే కోర్ట్ ఇలాగే తీర్పునిస్తుందా అనేది సమాలోచన చేసుకోవాలి. న్యాయం అంటేనే అందరికి సమానంగా ఉండేది. కానీ ఇలా పరిస్థితులను, మనుషులను బట్టి మారిపోతే ఇక న్యాయస్థానాలకు విలువ ఉండదు. తీర్పులపై విశ్వాసం సన్నగిల్లుతుందని చెప్పకతప్పదు.

T.V.SRIKAR