ఐపిఎస్ కు అష్టదిగ్బంధనం చేసిన బాబు

ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానిని అరెస్ట్ చేసి వేధించిన కేసు విషయంలో ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించింది. ఈ వ్యవహారంలో ఉన్న విజయవాడ మాజీ సీపీ కాంతి రానా టాటాను సస్పెండ్ చేసారు చంద్రబాబు. ఈ మేరకు జీవో నంబర్ 1591 ను విడుదల చేసారు ఆయన.

  • Written By:
  • Publish Date - September 15, 2024 / 07:55 PM IST

ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానిని అరెస్ట్ చేసి వేధించిన కేసు విషయంలో ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించింది. ఈ వ్యవహారంలో ఉన్న విజయవాడ మాజీ సీపీ కాంతి రానా టాటాను సస్పెండ్ చేసారు చంద్రబాబు. ఈ మేరకు జీవో నంబర్ 1591 ను విడుదల చేసారు ఆయన. సస్పెన్షన్ పై జీ వో లో పేర్కొన్న అంశాలు ఒకసారి పరిశీలిస్తే…

దర్యాప్తును సరిగ్గా పర్యవేక్షించడంలో విజయవాడ సీపీ గా రానా విఫలమయ్యారని పభుత్వం పేర్కొంది. అరెస్టులు చేయాలని ఆదేశాలు ఇచ్చే ముందు ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి ప్రాథమిక విచారణ జరిపినట్లు నిర్ధారణ కాలేదని తెలిపింది. 31.01.2024న అప్పటి ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పీ ఎస్ ఆర్ ఆంజనేయులుని కలిశారని, ఆయన సూచనల మేరకు హడావుడిగా వ్యవహరించారని విచారణ లో తేలినట్టు ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. నేరుగా తన సీ సీ కి చెప్పి డీసీపీ విశాల్ గున్నీ తో పాటు పలువురు అధికారులకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించి హడావుడి చేయడం వెనుక కారణాలను వివరించింది ప్రభుత్వం.

రాణా ప్రస్తుతం సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని… ఆల్ ఇండియా సర్వీసెస్ క్రమశిక్షణ & అప్పీల్ రూల్స్ 1969లోని సెక్షన్ 3 (1) కింద అందించబడిన అధికారాలను ఉపయోగించి, ప్రభుత్వం అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ను సస్పెండ్ చేస్తోందని జీవోలో ప్రస్తావించారు. సస్పెన్షన్ సమయంలో కాంతి రాణా టాటా ప్రభుత్వ అనుమతి లేకుండా అతను ప్రధాన కార్యాలయాన్ని విడిచిపెట్టకూడదని స్పష్టం చేసింది.