Chandra Babu Naidu: నేడు చంద్రబాబు మధ్యంతర బెయిలు పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పు

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ నేడు హైకోర్టు తీర్పు వెలువడించనుంది. ఈ క్రమంలో ఆయన పై ఇంకో కేసు దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది.

  • Written By:
  • Publish Date - October 31, 2023 / 07:43 AM IST

ఏపీ స్కిల్ డెవల్మెంట్ స్కాము కేసు ఏపీ రాజకీయాలను ఒక కుదుపు కుదిపింది. ఇందులో చంద్రబాబుకు మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం వాడీ వేడిగా హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు పూర్తైన తరువాత జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పును మంగళవారం ప్రకటిస్తామన్నారు. కౌంటర్ పిటిషన్ పై వెలువడే తీర్పు ఆధారంగానే ప్రధాన బెయిలు పిటిషన్ పై విచారణ ఉంటుందని తెలిపారు. ఈ మధ్యంతర పిటిషన్ వేయడాకి ప్రధాన కారణం అనారోగ్య సమస్యల రిత్యా ఆయనకు శస్త్ర చికిత్స చేయాలని బాబు తరఫు న్యాయవాదులు తెలిపారు. దీనిపై సీఐడీ తరఫు ప్రత్యేక పీపీ వివేకానంద స్పందించారు. న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆదేశాను సారం చంద్రబాబుకు జరిపిన వైద్య నివేదికలను కోర్టు ముందు ఉంచామన్నారు.

వాదనలు ఇలా..

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ్ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రధాన బెయిలు పిటిషన్ తోపాటూ మధ్యంతర బెయిలు పిటిషన్ పై వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ కేసులను పెట్టిందని ఆరోపించారు. 2021లో నమోదైన కేసులో చంద్రబాబును నిందితుడిగా చూపి ఉన్నపళంగా అరెస్ట్ చేశారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీని ఎలాగైనా దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలకు పాల్పడినట్లు వివరించారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే ముందుగా అవినీతి నిరోధక సవరణ చట్టం 17-ఎ ప్రకారం గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. అలాంటి నిబంధనలు ఏవీ పాటించకుండా గత 52 రోజులుగా చంద్రబాబును జైల్లోనే ఉంచారని తెలిపారు. గతంలో ఏసీబీ కోర్టు సీఐడీ అధికారులు దాఖలు చేసిన విచారణ పిటిషన్ పై స్పందించి రెండు రోజుల విచారించాలని ఆదేశాలు జారీ చేసిందని.. మరోసారి ఐదు రోజుల కస్టడీ కోరితే అందుకు నిరాకరించిందని వివరించారు. విచారణకు ఆదేశించే అవసరంలేనప్పుడు జైలులో ఉంచాల్సిన పనేముందని వాదించారు.

చంద్రబాబు న్యాయవాదులు మాట్లాడిన దానికి కౌంటర్ గా సీఐడీ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పందించారు. చంద్రబాబుకు జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. కంటికి సంబంధించిన శుక్లం ప్రారంభ దశలోనే ఉందని తక్షణమే చికిత్స అవసరం లేదని వివరించారు. బాబుకు ఉన్న సాధారణ అనారోగ్య సమస్యలను పెద్దవి చేసి చూపే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆయన బరువు విషయంలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని పెద్దగా తేడాలేదన్నారు. అందుకే మధ్యంతర బెయిలు ఇవ్వొద్దని కోరారు. ఈ కేసుపై ఇరువురి వాదనలు విన్న హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనున్నట్లు తెలిపింది.

T.V.SRIKAR