ఏపీ హైకోర్ట్ సెన్సేషన్, కూతుళ్ళకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ సంచలన తీర్పు వెల్లడించింది. ఇప్పటి వరకు తల్లి తండ్రుల బాధ్యత కుమారులదే అనే భావనకు ఏపీ హైకోర్ట్ ఫుల్ స్టాప్ పెట్టింది. వివాహమైనా కాకున్నా కుమారుడితోపాటు కుమార్తె కూడా ఆమె తల్లిదండ్రుల కుటుంబంలో ఎప్పటికీ భాగమేనని హైకోర్టు స్పష్టం చేస్తూ ఓ కేసులో తీర్పు వెల్లడించింది.

  • Written By:
  • Publish Date - November 2, 2024 / 02:00 PM IST

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ సంచలన తీర్పు వెల్లడించింది. ఇప్పటి వరకు తల్లి తండ్రుల బాధ్యత కుమారులదే అనే భావనకు ఏపీ హైకోర్ట్ ఫుల్ స్టాప్ పెట్టింది. వివాహమైనా కాకున్నా కుమారుడితోపాటు కుమార్తె కూడా ఆమె తల్లిదండ్రుల కుటుంబంలో ఎప్పటికీ భాగమేనని హైకోర్టు స్పష్టం చేస్తూ ఓ కేసులో తీర్పు వెల్లడించింది. తల్లిదండ్రుల బాగోగులు చూసుకునే బాధ్యతను ఆమె నుంచి దూరం చేయడానికి వీలు లేదని హైకోర్ట్ ధర్మాసనం స్పష్టం చేసింది. కారుణ్య నియామక వ్యవహారంలో వివాహమైన కుమారుడి విషయంలో లేని అనర్హత.. వివాహమైన కుమార్తె విషయంలో చూపడం వివక్ష అని అభిప్రాయపడింది కోర్ట్.

పెళ్లయిందన్న కారణంతో కూతురిని.. ఆమె తల్లిదండ్రుల కుటుంబంలో సభ్యురాలు కాదనడం దుర్మార్గం అని కోర్ట్ వ్యాఖ్యానించింది. అసలు ఈ తీర్పు ఎందుకు ఇచ్చింది, ఏ కేసులో ఇచ్చిందో ఒకసారి చూద్దాం.

విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో స్వీపర్ వి.జగదీష్ 2013 జూన్ 24న కన్నుమూశారు. ఆయనకు మోహన, సిరిపల్లి అమ్ములు అనే ఇద్దరు కుమార్తెలు ఉండగా… తండ్రి నిర్వహించిన స్వీపర్ పోస్టును కారుణ్య నియామకం కింద తనకు ఇవ్వాలని అమ్ములు దేవస్థానం అప్పటి ఈఓకి వినతిపత్రం సమర్పించగా కోర్టు నుంచి విడాకుల పత్రాన్ని తీసుకురావాలని ఈఓ సూచించారు. తన భర్త ఎక్కడున్నారో తెలియడం లేదని, తండ్రి స్వీపర్ పోస్టును తనకు ఇవ్వాలని మరోసారి ఈఓతోపాటు దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ కు వినతీ పత్రం ఇచ్చారు. అధికారులు స్పందించకపోవడంతో 2021లో హైకోర్టుకు వెళ్ళింది అమ్ములు.

తండ్రి కన్నుమూసేనాటికి ఆయనపై ఆధారపడి జీవిస్తున్నాను అనేందుకు ఆధారాలను పిటిషనర్ సమర్పించలేదని దేవాదాయ శాఖ తరపు న్యాయవాదులు వాదించారు. ఆమెకు వివాహమైందని, అప్పటి నుంచి భర్తతో నివసిస్తోందని తండ్రితో కలిసి జీవించడం లేదని వాదించారు. తాను విడాకులు తీసుకున్నానని చెబుతున్నారేకానీ విడాకుల పత్రాన్ని చూపడం లేదని కోర్ట్ ముందు ప్రస్తావించారు. అందువల్ల పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరిస్తూ 2018లో ఉత్తర్వులు జారీ చేయగా… పిటిషనర్, ఆమె సోదరికి వారి తండ్రి బతికుండగానే వివాహమైందని దేవాదాయ శాఖ న్యాయవాదులు స్పష్టం చేసారు. తన భర్త 20 డిసెంబర్ లో కన్ను మూశారని పిటిషనర్ ధ్రువపత్రం సమర్పించడాన్ని బట్టి చూస్తే 2013లో తండ్రి మరణించేనాటికి పిటిషనర్ ఆయనపై ఆధారపడి పిటిషనర్ జీవించడం లేదని స్పష్టమవుతోందని అమ్ములు తరపు న్యాయవాది డి.వి. శశిధర్ వాదనలు వినిపించారు.

1999లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 350 ప్రకారం వివాహిత కుమార్తె.. కారుణ్య నియామకానికి అర్హురాలే అని పిటిషనర్ భర్త సైతం మరణించారని, పిటిషనర్కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆ జీవో, సర్క్యులర్లను పరిశీలిస్తే వివిధ షరతులకు లోబడి వివాహిత కుమార్తె కారుణ్య నియామకానికి అర్హురాలని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. మృతి చెందిన ఉద్యోగి కుటుంబసభ్యులకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడమే కారుణ్య నియామక పథకం ముఖ్యోద్దేశమని… దీని అమలులో వివాహమైన కుమారుడి విషయంలో లేని అనర్హత.. వివాహమైన కుమార్తె విషయంలో చూపడం వివక్షేనని స్పష్టం చేసింది కోర్ట్.

అమ్ములుకు 8 వారాల్లోగా ఉద్యోగమివ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది కోర్ట్. పిటిషనర్ తండ్రి చనిపోయిన తేదీ నుంచి సర్వీసు ప్రయోజనాలు కల్పించాలనీ ఆదేశాలు జారీ చేసింది. ఈ కాలానికి ఆర్థిక ప్రయోజనం పొందేందుకు మాత్రం పిటిషనర్ అనర్హులని స్పష్టత ఇచ్చింది ఉన్నత న్యాయస్థానం. పిటిషనర్ కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం నిరాకరించడం తగదన్న ధర్మాసనం… పిటిషనర్ (సిరిపల్లి అమ్ములు)కు స్వీపర్/తగిన ఉద్యోగం ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కోర్ట్.