ఐతే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని వైసీపీ చెప్తున్నా.. ప్రచారం మాత్రం ఆగడం లేదు. 2019లో అధికారంలోకి వచ్చింది వైసీపీ.. ఐదేళ్ల అధికారాన్ని పూర్తిగా వినియోగించుకుంటామని క్లియర్‌గా చెప్పింది చాలాసార్లు. ఆరు నెలల కింద జగన్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు కూడా. ఐతే 6 నెలల్లో సీన్ పూర్తిగా మారిపోయింది. రాజకీయం టర్న్ తీసుకుంది. ముఖ్యంగా వైసీపీలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఝలక్ తగలడంతో జగన్ కూడా మనసు మార్చుకున్నారని.. ముందస్తుకే సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒక్కటి మాత్రం క్లియర్.. ఆరు నెలల కింద వైసీపీకి, ఇప్పుడు వైసీపీకి చాలా తేడా కనిపిస్తోంది.
ఒకప్పటి నమ్మకం ఇప్పుడు కనిపించడం లేదు ఆ పార్టీ నేతల్లో ! ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాక్ తగలడం, సొంత పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించడం.. వైసీపీని డిఫెన్స్‌లో పడేసింది. ఈ రెండు ఝలక్‌లతో జగన్‌లోనూ మార్పు కనిపించింది. అప్పటివరకు ఆదేశాలు మాత్రమే ఇచ్చిన జగన్.. ఇప్పుడు ఎమ్మెల్యేలకు సూచనలు ఇస్తున్నారు. బతిమిలాడే ధోరణిలోకి వెళ్లిపోయారు. ఇంకెంతమంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి జంప్ చేస్తారన్న భయం.. అధికార పార్టీ అధినేతలను వెంటాడుతోంది. వీటికి తోడు జనాల్లోనూ పార్టీ మీద వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇప్పుడు అంతో ఇంతో ఉన్న సానుకూలతను కాపాడుకొని.. మళ్లీ అధికారం దిశగా అడుగులు వేయాలంటే.. ముందస్తు ఎన్నికలే ఉత్తమం అని జగన్ డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారు.
ఇక అటు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని టీడీపీ అంటోంది. ఆరు నెలల ముందు నుంచే ముందస్తు ఎన్నికలు అంటూ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు చంద్రబాబు. లోకేశ్ పాదయాత్ర, ఇదేం ఖర్మ అంటూ చంద్రబాబు యాత్రలతో.. శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇక అటు పవన్ కూడా ముందస్తు ఖాయం అని ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నారు. షూటింగ్‌లన్నీ పూర్తి చేసేస్తున్నారు. ముందస్తుకు వెళ్తే ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అనే అంచనాలు ఇప్పుడు చాలామందిలో వినిపిస్తున్నాయ్. ఐతే ఒక్కొక్కరు ఒక్కోలా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
జగన్ నిజంగానే ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. అది వైసీపీకి నష్టమే అనేది కొందరి వాదన. ప్రస్తుతం పార్టీలో అనిశ్చితి ఉంది అన్నది క్లియర్. బయటపడడం లేదు కానీ.. చాలామంది ఎమ్మెల్యేల్లో తిరుగుబాటు స్వరం వినిపిస్తోంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరికొంతమంది కూడా ఇలాంటి అసంతృప్తితోనే కనిపిస్తున్నారని టాక్. ఇవన్నీ విపక్షాలకు బలం అయ్యే చాన్స్ ఉంది. వైసీపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే అవకాశాలు ఉంటాయ్. అదే జరిగితే టీడీపీ, జనసేన మరింత దూకుడు చూపించడం ఖాయం. ముందస్తు ఉంటుందా లేదా అన్న సంగతి ఎలా ఉన్నా.. ముందుగానే ఏపీ రాజకీయం మండుతోంది. దీంతో రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు ఉంటాయ్. ఏం జరగబోతుందన్నది మరింత ఆసక్తికరంగా మారింది.