డ్రాగన్ కంట్రీ కొట్టిన దెబ్బ అమెరికా టెక్ దిగ్గజం యాపిల్‌కు గట్టిగానే తగిలింది. చైనా ప్రభుత్వ కార్యాలయాల్లో ఐఫోన్లను బ్యాన్ చేస్తున్నట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాలతో యాపిల్ షేర్లు 2 రోజుల్లోనే 16 లక్షల కోట్లుకు పైగా పతనమయ్యాయి. ఇది కంపెనీ మొత్తం విలువలో సుమారు 6 శాతానికి సమానం. ప్రపంచంలో యాపిల్‌కు ఉన్న అతి పెద్ద మార్కెట్లలో చైనా ఒకటి. యాపిల్ మత్తం ఆదాయంలో 18 శాతం చైనా నుంచి వస్తుంది. అందుకే ఈ మార్కెట్ యాపిల్ సంస్థకు అత్యంత కీలకం.
యాపిల్ ఫోన్లు తయారు చేసే ఫాక్స్‌కాన్ సంస్థకు చైనాలో అతిపెద్ద యూనిట్ ఉంది. వాల్‌స్ట్రీట్‌లో యాపిల్ మార్కెట్ విలువ 2.8 ట్రిలియన్ డాలర్లు. రీసెంట్‌గా చైనాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఆఫీసు పనులకు యాపిల్ ఐఫోన్లు, విదేశీ బ్రాండ్ ఫోన్లూ వాడొద్దని అక్కడి ప్రభుత్వం సూచించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ బాంబు పేల్చింది. ప్రభుత్వ ఆధీనంలోని కంపెనీల ఉద్యోగులు కూడా యాపిల్ ఫోన్లను తీసుకురాకూడదని ఆదేశించే అవకాశం ఉందటూ ఆ మర్నాడే బ్లూమ్‌బెర్గ్ మరో కథనం పబ్లిష్ చేసింది. సెప్టెంబర్ 12న ఐఫోన్-15 విడుదలకు ముందు వచ్చిన ఈ వార్తలు యాపిల్ ఇన్వెస్టర్లలో కొత్త భయాలు పుట్టించాయి. దీంతో మార్కెట్‌లో యాపిల్ షేర్ వాల్యూ పడిపోయింది.
అయితే ఈ వార్తల గురించి చైనా ఇప్పటి వరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఫోన్ల వాడకం గురించి అధికారికంగా ఎలాంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు. అయినా యాపిల్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ వ్యవహారం ఇప్పుడు అమెరికా-చైనా మధ్య ఉన్న వ్యాపార ఉద్రిక్తతల్లో మరింత హీట్ పెంచింది. రీసెంట్‌గా అమెరికా చైనాకు చిప్ టెక్నాలజీ ఎగుమతులను నియంత్రించింది. దీనికి బదులుగా చైనా నుంచి పశ్చిమ దేశాల సెమీకండెక్టర్ పరిశ్రమకు సరఫరా అయ్యే రెండు కీలక పదార్థాల ఎగుమతులను డ్రాగన్ నిలువరించింది. ఇలాంటి సిచ్యువేషన్‌లో యాపిల్ మీద ఆంక్షలు విధించారంటూ వార్తలు రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.