ఆంధ్రప్రదేశ్ రాజధాని గొడవ ఇప్పట్లో తేలేలా లేదు. అసలు ఏపీకి రాజధాని ఏదో కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు. అధికారిక రికార్డుల్లో అమరావతి అని నమోదైనా.. దాన్ని గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వమే సిద్ధంగా లేదు. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నినాదంతో ముందుకెళ్తోంది. ఈ అంశం ఇప్పుడు కోర్టులో ఉండడంతో ఏపీ జనమంతా రాజధానిపై సందిగ్ధంలోనే ఉన్నారు. అయితే ఏపీ రాజధాని అమరావతిని ఫ్యూచరిస్టిక్ నగరంగా గుర్తిస్తూ ఒక అంతర్జాతీయ మేగజైన్ ఓ కథనం ప్రచురించింది. భవిష్యత్తులో ప్రపంచాన్ని మార్చేయగల నగరాల్లో అమరావతి ఒకటని పేర్కొంది. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది.
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మానస పుత్రిక అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనేది తన కోరిక. విభజన అనంతరం దీన్ని ఏపీ ప్రజలు తనకు కట్టబెట్టిన బాధ్యతగా చెప్పుకుంటారు చంద్రబాబు. అందులో భాగంగా అమరావతి రూపకల్పనకోసం ప్రంపంచంలో పేరెన్నికగన్న ఆర్కిటెక్టులను పిలిపించారు. డిజైన్లను రూపొందించారు. దీనికోసం దాదాపు మూడేళ్లపాటు కసరత్తు చేశారు. ప్రపంచమంతా చెప్పుకునేలా డిజైన్లు ఉండాలని.. నగరం కట్టిన తర్వాత దీని గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగాలని చంద్రబాబు భావించారు. అందుకు తగ్గట్టుగానే సచివాలయం, హైకోర్టు భవనాలను ఐకానిక్ బిల్డింగులుగా తీర్చిదిద్దేలా డిజైన్లు ఖరారు చేశారు. నదీముఖంగా అమరావతి రాజధాని నగరం నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
https://www.architecturaldigest.com/gallery/futuristic-cities-concept-roundup
ఇంతలో ఎన్నికలొచ్చాయి. చంద్రబాబు ఓడిపాయారు. జగన్ అధికారంలోకి వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జైకొట్టిన జగన్ ఆ తర్వాత మాట మార్చారు. అమరావతి భూముల్లో అవకతవకలు జరిగాయని.. ఇక్కడ రాజధాని కట్టాలంటే లక్షకోట్లుక పైగా ఖర్చవుతుందని చెప్పారు. దీంతో మూడు రాజధానుల నినాదం తెరపైకి తీసుకొచ్చారు. తద్వారా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పుకొచ్చారు. దీంతో అమరావతి గ్రాఫికల్ సిటీ అటకెక్కింది. చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట మూలన పడింది. నాడు చంద్రబాబు కట్టిన రోడ్లు, బిల్డింగులు.. ఇప్పుడు బోసిపోతున్నాయి. పిచ్చిమొక్కలతో అమరావతి నిండిపోయింది.
Amaravati featured on the list of futuristic cities published by the prestigious Architectural Digest magazine for what it was (and is) destined to become – a modern, sustainable City which will make India proud on the global stagehttps://t.co/GEMBqnVC5S
— N Chandrababu Naidu (@ncbn) February 28, 2023
ఇలాంటి అమరావతిని ప్రపంచంలోని టాప్ 5 ఫ్యూచరిస్టిక్ నగరాల్లో ఒకటిగా గుర్తిస్తూ ఆర్కిటెక్చరల్ డిజైన్ అనే ప్రముఖ మ్యాగజైన్ ఓ స్టోరీ ప్రచురించింది. అసలు పేపర్ పైన తప్ప కళ్లముందు కనిపించని ఓ నగరాన్ని ఫ్యూచరిస్టిక్ సిటీగా పేర్కొంటూ కథనం ప్రచురించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ఆ కథనాన్ని కోట్ చేస్తూ చంద్రబాబు ట్వీట్ చేయడం మరిన్ని విమర్శలకు తావిస్తోంది. మరి ఆ పత్రిక ఇక్కడి వాస్తవ పరిస్థితి తెలిసి ఈ కథనం రాసిందా.. లేకుంటే తెలియక రాసిందా.. అనేది చూడాలి.