ఏపీలో చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఒక కేసులో వాదనలు పూర్తి కాకుండానే మరో కేసును తెరపైకి తెస్తూ చంద్రబాబుకు ఊపిరి ఆడకుండా చేస్తోంది ఏపీ సీఐడీ. ఒక రంగా చూస్తే ఇక చంద్రబాబును బయటికి రానీయకుండా లోపలే ఉంచేలా పాత కేసులన్నీ తవ్వుతున్నట్టు కనిపిస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ వ్యవహారంలో స్కామ్ జరిగిందంటూ చంద్రబాబును మొదట అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసులో చంద్రబాబుబ రిమాండ్‌కు వెళ్లారు. కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ అధికారులు. బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు లాయర్లు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లలో ఎలాంటి క్లారిటీ రాకుండానే ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో కూడా చంద్రబాబును విచారించాలంటూ పీటీ వారెంట్ దాఖలు చేశారు సీఐడీ అధికారులు.
ఆ కేసులో కూడా చంద్రబాబును విచారించాలని.. కచ్చితంగా కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌కు అప్లై చేసిన చంద్రబాబు లాయర్లు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం చట్టవిరుద్ధమని.. ఎఫ్ఐఆర్ తప్పుగా నమోదు చేశారని.. కేసును వెంటనే కొట్టివేయాలంటూ వాదించారు. ఈ పిటిషన్‌లో ఇంకా ఎలాంటి క్లారిటీ లేకుండానే మరో పీటీ వారెంట్ తెరపైకి తెచ్చారు సీఐడీ అధికారులు. ఫైబర్ నెట్ వ్యవహారంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారంటే మరో కొత్త పీటీ వారెంట్ విజయవాడ సీబీఐ కోర్టులో దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ లిస్ట్‌లో ఉన్న సంస్థకు అక్రమంగా టెండర్లు ఇచ్చారంటూ ఆరోపించారు.
ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు చుట్టు సీఐడీ అధికారులు వ్యూహాత్మకంగా ఎచ్చు బిగిస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. స్కిల్ స్కామ్‌కు సంబంధించి ఇప్పటి వరకూ ఒక్క ఎవిడెన్స్ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో వాదనలు ఇంకా పూర్తి కాలేదు. ఈ గ్యాప్‌లోనే ఫైబర్ నెట్ స్కాం అంటూ మరో వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారు. వీటన్నికి సంబంధించి సీఐడీ దగ్గర ఆధారాలు ఉన్నాయా లేదా అన్న విషయం పక్కన పెడితే.. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబును బయటికి రానివ్వకుండా వరుస కేసులు పెడుతున్నారనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సీఐడీ అధికారులు ఇక్కడితో ఆగుతారా దీని తరువాత మరిన్ని కేసులు బయటికి తీస్తారా అనే ఆందోళనలో ఉన్నారు టీడీపీ శ్రేణులు.