ఐపీఎల్ మెగా వేలం ఆర్సీబీ టార్గెట్ ఈ బౌలర్లేనా ?

ఐపీఎల్ లో ప్రతీసారీ భారీ అంచనాలతో బరిలోకి దిగి వట్టి చేతులతో నిష్క్రమించే జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరే...ఏ సాలా కప్ నమదే అంటూ హడావుడి చేసినా ఆటతీరు మాత్రం పేలవంగానే ఉంటోంది.

  • Written By:
  • Publish Date - August 17, 2024 / 07:21 PM IST

ఐపీఎల్ లో ప్రతీసారీ భారీ అంచనాలతో బరిలోకి దిగి వట్టి చేతులతో నిష్క్రమించే జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరే…ఏ సాలా కప్ నమదే అంటూ హడావుడి చేసినా ఆటతీరు మాత్రం పేలవంగానే ఉంటోంది. లీగ్ స్టేజ్ లేదంటే ప్లే ఆఫ్స్ వరకే పరిమితమవుతూ వస్తోంది. అయితే వచ్చే సీజన్ లో ఎలాగైనా కప్పు కొట్టాలని పట్టుదలతో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెగా వేలం కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఆర్సీబీలో విధ్వంసకర బ్యాటర్లు ఉన్నా ప్రతీసారీ బౌలింగ్ విభాగం మాత్రం బలహీనంగానే కనిపిస్తోంది. దీంతో ఈ సారి బౌలింగ్ కూర్పుపై ఫుల్ ఫోకస్ పెట్టబోతోంది. కొందరి అంచనాల ప్రకారం బెంగళూరు టీమ్ ఈ సారి వేలంలో పేస్ బౌలర్ నటరాజన్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కు గత కొన్నేళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న నటరాజన్ కు ఐపీఎల్ లో మంచి రికార్డే ఉంది. 57 మ్యాచ్ లలో 8.16 ఎకానమీతో 61 వికెట్లు తీసాడు.

డెత్ ఓవర్స్ లో బౌలింగ్ ను మరింత పటిష్టం చేసుకోవడమే లక్ష్యంగా అతన్ని వేలంలో కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. అలాగే సౌతాఫ్రికా యువ ఫాస్ట్ బౌలర్ నాండ్రే బర్గర్ పైనా ఆర్సీబీ కన్నేసింది. గత సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిథ్యం వహించిన బర్గర్ తనదైన పేస్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్ తో పాటు ఫ్రాంచైజీ లీగ్స్ లోనూ బర్గర్ అదరగొడుతున్నాడు. దీంతో ఈ సఫారీ పేసర్ ను కూడా తీసుకునే అవకాశముంది. ఇక స్పిన్ విభాగంలో ఆర్ సాయి కిషోర్ కోసం బెంగళూరు ఫ్రాంచైజీ ప్రయత్నించే ఛాన్సుంది. చాహల్ వెళ్ళిపోయిన తర్వాత ఆర్సీబీ స్పిన్ విభాగం అనుకున్నంత బలంగా లేదు. దీంతో గుజరాత్ టైటాన్స్ తరపున నిలకడగా రాణిస్తున్న సాయికిషోర్ ను వేలంలో కొనుగోలు చేసేందుకు రెడీ అవుతోంది. 10 ఐపీఎల్ మ్యాచ్ లే ఆడినప్పటకీ దేశవాళీ క్రికెట్ లో అతనికి మంచి రికార్డుంది. ఈ నేపథ్యంలో తమ స్పిన్ విభాగం సాయికిషోర్ తో బలంగా మారుతుందని ఆర్సీబీ అంచనా వేస్తోంది.