ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కు ముందు మెగా వేలం జరగబోతోంది. ఈ మెగా వేలానికి ముందే కొందరు ఆటగాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వీడ్కోలు పలుకుతాడన్న చర్చ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వేలంలో అన్ క్యాప్డ్ ప్లేయర్ ధోనీని తీసుకునేందుకు చెన్నై అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ బీసీసీఐ ఈ రూల్ కు అంగీకరిస్తే ప్లేయర్ గా మహిని తీసుకోవడం ఖాయం. అయితే వచ్చే సీజన్ సమయానికి ధోనీ ఫిట్ నెస్ ఎంతవరకూ సహకరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గత సీజన్ తర్వాత మహి మోకాలికి సర్జరీ జరిగింది. ప్రస్తుతం దాని నుంచి కోలుకున్న ధోనీ వచ్చే సీజన్ లో ఆడేందుకు రెడీగా ఉన్నట్టు సంకేతాలిచ్చాడు. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడతాడన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవేళ సీజన్ కు ముందు రిటైర్మెంట్ ప్రకటించినా మెంటార్ రోల్ లో ధోనీ చెన్నై జట్టుతోనే ఉంటాడని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన శిఖర్ ధావన్ కూడా ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముంది. వేలంలో ధావన్ ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసే అవకాశాలు లేవన్న వార్తల నేపథ్యంలో గబ్బర్ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. ఇక ఢిల్లీ పేసర్ ఇశాంత్ శర్మ కూడా ఐపీఎల్ 18వ సీజన్ లో కనిపించకపోవచ్చు. ఫిట్ నెస్ సమస్యలు, ఫామ్ కోల్పోయిన ఇశాంత్ ఐపీఎల్ కు ఆటగాడిగా గుడ్ బై చెప్పే ఛాన్సుంది. తర్వాత మెంటార్ షిప్ రోల్ లో ఈ ఢిల్లీ పేసర్ కనిపించే అవకాశాలున్నాయి.