ప్రపంచ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ రికార్డుల ఎవరెస్ట్… లెక్కలేనన్న రికార్డులు, టన్నుల కొద్దీ పరుగులు చేసిన భారత క్రికెట్ దిగ్గజం.. మరి తండ్రి వారసత్వాన్ని అందుకునే క్రమంలో అర్జున్ టెండూల్కర్ ఇప్పుడిప్పుడే కెరీర్ లో ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఆల్ రౌండర్ గా అర్జున్ ఇప్పటి వరకూ చెప్పుకోదగిన ప్రదర్శనలు ఏమీ చేయలేదు. దేశవాళీ క్రికెట్ లో పర్వాలేదనిపించిన సచిన్ కొడుకు ఇంకా రాటుదేలాల్సిందే. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ఆడినా పెద్దగా చెప్పుకోదగిన ఆటతీరు కనబరచలేదు. అయితే ఇప్పుడు మెగావేలం ముంగిట దేశవాళీ క్రికెట్ లో రాణిస్తున్నాడు. తాజాగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్‌లో బంతితో అదరగొట్టాడు.
ఈ టోర్నీలో గోవా తరపున ఆడుతున్న అర్జున్ ఆతిథ్య కర్ణాటకపై 9 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు , రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లతో కర్ణాటక పతనాన్ని శాసించాడు. అర్జున్ టెండూల్కర్ సంచలన బౌలింగ్‌తో ఈ మ్యాచ్‌లో గోవా ఇన్నింగ్స్ 189 పరుగుల తేడాతో కర్ణాటకను చిత్తు చేసింది. దేశవాళీ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 49 మ్యాచ్‌లే ఆడిన అర్జున్ టెండూల్కర్.. 68 వికెట్లు పడగొట్టాడు. లెఫ్టార్మ్ మీడియం పేసర్ అయిన అర్జున్ టెండూల్కర్ తన కెరీర్‌లో 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 21 వికెట్లు తీసాడు. రంజీ ట్రోఫీ ఆరంభానికి ముందు అర్జున్ కు ఇది కాన్ఫిడెన్స్ పెంచుతుందని చెప్పొచ్చు. అలాగే మెగావేలంలో ఫ్రాంచైజీల దృష్టిలో పడేందుకు కూడా ఈ ప్రదర్శన ఉపయోగపడుతుంది.