ఇప్పుడు అంతటా మనదేశం పేరు మార్పుపైనే చర్చ జరుగుతోంది. ‘ఇండియా’ పేరును ‘భారత్’ గా మారుస్తారనే దానిపై మీడియాలో పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ మధ్యనైతే వాగ్యుద్ధమే నడుస్తోంది. ఇప్పుడు యూరప్ టూర్ లో ఉన్న రాహుల్ గాంధీ .. అక్కడ జరిగే మీటింగ్స్ లోనూ ‘ఇండియా’ పేరు మార్పుపై హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో మన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు దేశం పేరుపై జరిగిన చర్చల్లో తుది నిర్ణయం ఏం తీసుకున్నారు? రాజ్యాంగంలోని మొదటి ముసాయిదాలో ‘భారత్’ పేరు ఉందా? ఆ పేరు ఎప్పుడొచ్చింది? అనే వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వాస్తవానికి మన దేశ రాజ్యాంగం మొదటి ముసాయిదాలో ‘భారత్’ అనే పదమే వాడలేదు. డాక్టర్ అంబేద్కర్ తొలి రాజ్యాంగ ముసాయిదాను 1948 నవంబర్ 4న రాజ్యాంగ సభలో సమర్పించారు. ఆర్టికల్ 1లో దేశం పేరు గురించి ప్రస్తావన ఉంటుంది. రాజ్యాంగం మొదటి ముసాయిదాలోని ఆర్టికల్ 1లో ‘భారత్’ అనే పదమే లేదు. ‘‘ఇండియా రాష్ట్రాల యూనియన్’’ అనే ప్రస్తావనను మాత్రమే ఆనాడు పొందుపరిచారు. ఏడాది తర్వాత (1949 సెప్టెంబర్ 17న) డాక్టర్ అంబేద్కర్ ఆర్టికల్ 1కు కొన్ని సవరణలు ప్రతిపాదించారు. ‘‘ఇండియా అంటే భారత్, రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది’’ అని కొత్త ప్రపోజల్ చేశారు. దీనికి వెంటనే రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది. ఆ మరుసటి రోజే ( సెప్టెంబర్ 18న) మధ్యప్రదేశ్ కు చెందిన హెచ్.వి. కామత్ భారతదేశం పేరును ప్రస్తావిస్తూ ఆర్టికల్ 1కు రెండు సవరణలు ప్రతిపాదించారు. అందులో మొదటిది దేశం పేరు ‘‘భారత్ లేదా ఆంగ్ల భాషలో ఇండియా, రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది’’ అని, రెండోది ‘‘హింద్ లేదా ఆంగ్ల భాషలో ఇండియా, రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది’’ అని ప్రతిపాదించారు. కానీ ఈ రెండు సవరణలు పరస్పర విరుద్ధమని రాజ్యాంగ సభకు చైర్మన్‌గా ఉన్న రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈక్రమంలో మన దేశానికి ఎలాంటి పేరును ఖరారు చేయాలనే దానిపై రాజ్యాంగ సభ సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ‘ఇండియా దటీజ్ భారత్’ పేరును కొందరు.. ‘భారత్ దటీజ్ ఇండియా’ పేరును ఇంకొందరు.. ‘భారత్’ పేరును మరికొందరు ప్రతిపాదించారు. ఆ పేర్లపై ఆనాడు లోతుగా చర్చ కూడా జరిగింది. కానీ అవేవీ ఎంపిక కాలేదు.
‘‘ఇండియా అంటే భారత్, రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది’’ అనేదే కంటిన్యూ అయింది. అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ కూడా భారతదేశానికి భారత్ లేదా భరత్ వర్ష అని పెట్టాలని సూచించారు. డాక్టర్ అంబేద్కర్ భారతదేశానికి అయోమయమైన పేరు పెట్టారని 1949 నవంబర్ 24న జరిగిన చర్చలో బిహార్‌కు చెందిన మహమ్మద్ తాహిర్ అన్నారు. ‘‘మన రాజ్యాంగం మన దేశానికి పేరు పెట్టలేక పోయిందది, తికమక పెట్టే పేరు పెట్టారు. దాన్ని అంగీకరించారు కూడా. మీ దేశం పేరేంటని ఎవరైనా అంబేద్కర్‌ను అడిగితే.. భారత్, ఇండియా లేదా హిందుస్థాన్ అని చెప్పవచ్చు. నన్ను ఎవరైనా అడిగితే ‘‘ఇండియా దటీజ్ భారత్’’ అని చెప్పాలి” అని తాహిర్ విమర్శించారు.ఇక భారత రాజ్యాంగాన్ని 26 నవంబర్ 1949న ఆమోదించారు. ఇది 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. అందుకే మనం ఏటా జనవరి 26న రిపబ్లిక్ డే నిర్వహించుకుంటాము..