Revanth Reddy: స్నేహానికి చాచిన హస్తం.. కోమటి రెడ్డితో రేవంత్‌ రెడ్డి భేటీ..

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీలో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. తమను సంప్రదించకుండా రేవంత్‌ ఇష్టాపూర్తిగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ రేవంత్‌ రెడ్డి మాత్రం చాలా కొత్తగా రియాక్ట్‌ అయ్యారు.

  • Written By:
  • Publish Date - June 21, 2023 / 02:26 PM IST

ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డితో భేటీ అయ్యారు. స్వయంగా వెంకట్‌ రెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు. తాను సీనియర్లకు వ్యతిరేకం కాదని చెప్పకనే చెప్పేందుకు రేవంత్‌ రెడ్డి ఈ పని చేసినట్టు తెలుస్తోంది. ఇక చేరికల విషయం మాత్రమే కాదు.. పార్టీలో తీసుకునే ప్రతీ కీలక నిర్ణయం సీనియర్లను సంప్రదించిన తరువాతే తీసుకుంటామంటూ చెప్పారు రేవంత్‌ రెడ్డి. తమ పార్టీలో అంతర్గత పోరు లేదన్నారు. ఇది కాంగ్రెస్‌ పార్టీపై బురద జల్లేందుకు కొందరు చేస్తున్న విష ప్రచారమంటూ చెప్పారు. విషయం ఏదైనా అంతా కూర్చుని చర్చించుకుంటామంటూ చెప్పారు.

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డితో భేటీ ఐన రేవంత్‌ రెడ్డి ఆయనతో కలిసి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి బయల్దేరారు. అక్కడ జూపల్లితో భేటీ అనంతరం అంతా కలిసి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇంటికి రానున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి పొంగులేటిని కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు. ఇప్పటికే పొంగులేటి, జూపల్లి చేరిక ఖరారు కాగా వీళ్లిద్దరూ జూలై 2న ఖమ్మంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేయబోతున్న సభకు కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ కూడా హాజరు కాబోతున్నారు.

రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలోనే పొంగులేటి కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ నేతలంగా ఒక్క తాటిపైకి వస్తుండంతో కాంగ్రెస్‌ క్యాడర్‌లో జోష్‌ కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న కామన్‌ సమస్య అంతర్గత పోరు. దాన్ని పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్లిన కారణంగానే కర్నాటకలో కాంగ్రెస్‌ పార్టీకి విజయం సులభమైంది. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే వ్యూహాన్ని ఉపయోగించబోతోంది కాంగ్రెస్‌ పార్టీ. అంతర్గత పోరును పక్కనబెట్టి నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి బీఆర్‌ఎస్‌ మీద యుద్ధం చేయబోతున్నట్టు కనిపిస్తోంది. అయితే రోజుకో తీరుగా మారిపోయే టీపీసీసీ పరిస్థితి ఇలాగే బలంగా ఉంటుందా.. కొన్ని రోజులకే మళ్లీ విషయం మొదటికి వస్తుందా చూడాలి.