Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. వేతన పెంపు సహా రెండు వారాంతపు సెలవులపై త్వరలో కీలక ప్రకటన

బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు తీపి కబురు వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు వేతనాల పెంపుతో పాటూ, వారానికి ఐదు రోజుల పనిదినాల అంశంపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపే ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరిపి ఆర్బీఐ ఒక ప్రకటన వెలువరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

  • Written By:
  • Publish Date - October 29, 2023 / 09:21 AM IST

ప్రస్తుతం మన సమాజంలో కేవలం ఐటీ ఉద్యోగులకు మాత్రమే వారంలో ఐదు రోజుల పనిదినాలు అమలు అవుతున్నాయి. ఈ కోవలోకి ఎల్ఐసీ కూడా చేరింది. శని, ఆది వారాలు సెలవు దినాలుగా చెప్పవచ్చు. అయితే బ్యాంకులకు రెండు వారాలు పూర్తి స్థాయి పనిదినాలు, మరో రెండు వారాలు ఐదు రోజులు పనిదినాలుగా నిర్ణయించిది ఆర్బీఐ. రానున్న రోజుల్లో బ్యాంకు ఉద్యోగులకు కూడా ప్రతి వారం రెండు వారాంతపు సెలవులు వచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ అంశంపై ప్రస్తుతం ఆర్థిక శాఖలో సంప్రదింపులు జరుపుతోంది. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం లభిస్తే బ్యాంకులు కూడా వారంలో ఐదు రోజులు మాత్రమే పని చేస్తాయి. రెండు రోజులు వారాంతపు సెలవులు లభించే అవకాశం ఉంది.

పనిదినాలతో పాటూ వేతనాల పెంపు అంశంపై కూడా కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఉద్యోగులతో సంప్రదింపులు జరిగి 15 శాతం వేతన పెంపునకు సిద్దంగా ఉన్నట్లు తెలిపింది. అయితే తమకు అంతకంటే అధికంగా వేతనాలు పెంచాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. గతంలో కోవిడ్ సమయంలో బ్యాంకింగ్ సేవలు నిర్వరామంగా కొనసాగించి, ప్రజలకు సేవలందించడంతో బ్యాంకులు అన్నీ లాభాల బాట పట్టాయి. అందుకే తమకు మెరుగైన వేతనాలు అమలయ్యేలా చూడాలని కోరుతున్నారు. దీనిపై త్వరలో ఒక స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

T.V.SRIKAR