రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కొందరు రాజకీయ (Telugu politics) నాయకులు ఇటు నుంచి అటు… అటు నుంచి ఇటు… పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. అవతల పార్టీవోళ్ళు పదవి, డబ్బులు ఆశ చూపిస్తేనో… లేదంటే ఇటు పార్టీ వాళ్ళు తనకు అవకాశం ఇవ్వలేదన్న కోపంతోనే వేరే పార్టీల కండువాలు మార్చేస్తున్నారు. తెలంగాణ (Telangana) లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంటే… అటు ఆంధ్రాలోనూ అసమ్మతి స్వరాలు బాగానే ఉన్నాయి. అయితే వీళ్ళంతా చెప్పేది ఒక్కటే మాట… తాము ప్రజల ప్రయోజనాల కోసమే పార్టీ మారుతున్నామని… నియోజకవర్గ అభివృద్ధి కోసమని చెప్పుకుంటున్నారు. వీళ్ళ మాటలు విని జనం నవ్వుకుంటున్నారు. మీ స్వార్థం కోసం జంపింగ్స్ చేస్తూ అందులో మళ్ళీ మమ్మల్ని ఎందుకు లాగుతారని ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర ప్రజలన ప్రయోజనాల కోసమే బీజేపీ (BJP) తో పొత్తులు పెట్టుకున్నాం అని టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు అంటుంటారు. కానీ అది నిజమేనా… ఆయన అధికారం కోసం… అంతకంటే మించి ఎన్నికల్లో జగన్ (CM Jagan) ను ఎదుర్కోవడం కష్టమన్న భయంతోనే పొత్తులు పెట్టుకున్నట్టు అందరికీ తెలుసు. ఒకప్పుడు ఘోరంగా తిట్టిన మోడీని ఇప్పుడు బాబు తెగ పొగుడుతున్నారు. టీడీపీయే కాదు… రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు మారుతున్న నేతలంతా ఇలాంటి సాకులే చెబుతున్నారు. ఒక్కసారి నియోజకవర్గంలో నిలబడితే తమకు ఇమేజ్ పెరుగుతుందనీ… అంతకంటే ముఖ్యంగా గెలిచినా… గెలవకున్నా… పేరున్న పార్టీ తరపున నిలబడితే నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చని ఆశతోనే పార్టీలు మారుతున్నారు కొందరు. కానీ నియోజక అభివృద్ధి కోసం… జనానికి మరింత సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో పార్టీలు మారుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) లో పదేళ్ళ పాటు హాయిగా అధికారాన్ని అనుభవించి… ఎర్రబుగ్గ కార్లలో తిరిగి జల్సా చేసిన నేతల్లో చాలామంది కాంగ్రెస్ (Congress), బీజేపీల్లోకి జంప్ అవుతున్నారు. గులాబీ పార్టీలో నెంబర్ 2 గా చలామణి అయిన కేకే లాంటి వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళడానికి తెలంగాణ ప్రయోజనాల కోసమేనట. ఈమధ్యే పార్టీ మారిన దానం నాగేందర్ గురించి అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది… ఒక్క నైట్ తేడాతో రెండు, మూడు కండువాలు మార్చిన విషయం జనానికి ఇప్పటికీ గుర్తుంది. వీళ్ళే కాదు… గతంలో BRSలోకి జంప్ అయిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అంటే. నియోజకవర్గం అభివృద్ధి ఏమో గానీ… అధికార పార్టీలో చేరి… ఆ తర్వాత ఎంత వెనకేసుకున్నారో… ఆయా నియోజకవర్గాల్లో జనం కథ కథలుగా చెప్పుకుంటారు.
తాము ఉన్న పార్టీ విధానాలు నచ్చకపోతేనే… తమకు అవమానాలు జరుగుతున్నాయనో పార్టీలు మారడంలో తప్పులేదు… కానీ జనానికి మేళ్ళు చేద్దామని చెబుతున్న కొందరు రాజకీయ నేతల వైఖరిని జనం అసహ్యించుకుంటున్నారు. తాము సుద్దపూసలమనీ… మీ కోసమే త్యాగాలు చేస్తున్నామని చెబితే నమ్మే పరిస్థితుల్లో జనం లేరని… ఈ సో కాల్డ్ జంపింగ్ జపాంగ్స్ తెలుసుకుంటే బెటరేమో.