లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న వేళ.. మరో హామీ అమలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఆరు గ్యారంటీలో (Six Guarantees) ఇప్పటికే రెండు స్కీములను అమలు చేసింది కాంగ్రెస్. మిగతా పథకాల అమలు కోసం జనాలు ఎదురుచూస్తున్నారు. మొత్తం వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చింది. దీనిలోభాగంగా వచ్చే నెల నుంచి 2వందల యూనిట్ల ఫ్రీ విద్యుత్ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంపు హామీలు అమలు చేసింది రేవంత్ సర్కార్.
ప్రస్తుతం రాష్ట్రంలో కోటి 31 లక్షల 48 వేల డొమెస్టిక్ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయ్. వీటిలో నెలకు 2వందల యూనిట్ల లోపు వాడేవి దాదాపు కోటీ 5 లక్షల వరకు ఉన్నాయ్. ఈ కనెక్షన్ల నుంచి ప్రతి నెల కరెంటు బిల్లులపై విద్యుత్ పంపిణీ సంస్థలకు సుమారు 350 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ కోటి 5లక్షల ఇళ్లకు కరెంటు ఫ్రీగా ఇస్తే.. (Power Connections) ఈ సొమ్మంతా డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక యూనిట్ కరెంటు సరఫరాకు సగటున 7 రూపాయల 7పైసలు ఖర్చు అవుతోంది. అయితే 2వందల యూనిట్లు ఉపయోగించేవారికి.. ప్రస్తుతం సగటు వ్యయం కంటే తక్కువ ఛార్జీలే వసూలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న వినియోగం ఆధారంగా.. ఏడాదికి 4వేల 2వందల కోట్లు డిస్కంలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. యావరేజ్ సప్లయ్ కాస్ట్ ప్రకారం చెల్లించాల్సి వస్తే ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అటు ఉచిత కరెంటు పొందే ఇళ్ల వినియోగదారుల వివరాల నమోదు కోసం ప్రత్యేక పోర్టల్ తీసుకురావాలని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఈ పథకం పొందాలనుకునేవారు కరెంటు కనెక్షన్ల వివరాలన్ని పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. వినియోగదారులు కూడా నేరుగా పోర్టల్‌లో నమోదు చేసుకునే అవకాశాన్ని కర్ణాటకలో కల్పించారు. ఇక్కడ కూడా అదే అమలు చేయబోతున్నారు.