రోహిత్,కోహ్లీ అవసరమా ? నెహ్రా సంచలన వ్యాఖ్యలు

  • Written By:
  • Publish Date - August 6, 2024 / 05:52 PM IST

టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలను ప్రశ్నిస్తూ జట్టు ఎంపికపై విమర్శలు గుప్పించాడు. లంక టూర్ కు అసలు జట్టులో కోహ్లీ, రోహిత్ శర్మ అవసరమా అని ప్రశ్నించాడు. శ్రీలంకపై వీరిద్దరినీ ఆడించాల్సిన అవసరమే లేదన్నాడు. ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లను మాత్రమే ప్రయత్నిస్తే బాగుంటుందని నెహ్రా అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ గెలిచిన తర్వాత రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌ నుంచి ఈ ఇద్దరు జట్టులోకి తిరిగి వస్తారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే గంభీర్ కోచ్ అయిన వెంటనే శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడేందుకు రోహిత్, కోహ్లీలను పిలిచాడు.

ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టు కూర్పుపై క్లారిటీ కోసమే అతను పిలిచాడని తెలుస్తోంది. అయితే లంక టూర్ లో రోహిత్ అదరగొట్టినా, కోహ్లీ మాత్రం నిరాశపరిచాడు. కోహ్లీ, రోహిత్ ల ఆట గురించి తెలిసిన గంభీర్ యువ ఆటగాళ్ళ సత్తాను పరీక్షించాలని నెహ్రా సూచించాడు. ఎందుకంటే వచ్చే రెండేళ్ళలో రోహిత్ , కోహ్లీ కొన్ని సిరీస్ లకే పరిమితమవుతారని, అలాంటప్పుడు యువ ఆటగాళ్ళను రీప్లేస్ మెంట్స్ గా సన్నద్ధం చేసుకోవాలన్నది నెహ్రా వాదన. ఇదిలా ఉంటే గంభీర్ వ్యూహాలే లంకతో వన్డే సిరీస్ లో భారత్ ను దెబ్బతీసాయని పలువురు విశ్లేషిస్తున్నారు.