టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మైంట్ నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్ షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన కాసేపటికే ఈ విషయాన్ని బీసీసీఐ తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయం వెల్లడించింది. నిజానికి టీ సమయంలో అశ్విన్ ను కోహ్లి హగ్ చేసుకున్నప్పుడే ఈ అనుమానం వచ్చింది. అంతకుముందు అతనితో అశ్విన్ చాలాసేపు మాట్లాడాడు. డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లి, అశ్విన్ మధ్య చాలాసేపు తీవ్రంగా చర్చ జరిగింది. మధ్యలో ఒకసారి అశ్విన్ ను కోహ్లి హగ్ చేసుకోవడం కనిపించింది. అప్పుడే రిటైర్మెంట్ ఊహాగానాలు రాగా.. ఆ కాసేపటికే అధికారిక ప్రకటన వచ్చేసింది.
ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న అశ్విన్.. తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. అశ్విన్ ఆకస్మిక నిర్ణయంతో అభిమానులు, సహచర ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు షాకయ్యారు. సోషల్ మీడియా వేదికగా అతనికి అభినందనలు తెలుపుతున్నారు. భవిష్యత్తు మరింత బాగుండాలని ఆకాంక్షిస్తున్నారు. వాస్తవానికి అశ్విన్.. పెర్త్ టెస్ట్ విజయానంతరమే రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నాడట. ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.కానీ తానే పింక్ బాల్ టెస్ట్ ఆడాలని రిక్వెస్ట్ చేశాననీ, దీంతో వెనక్కి తగ్గిన అశ్విన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వాయిదా వేసుకొన్నాడని రోహిత్ చెప్పాడు.
అశ్విన్ నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని రోహిత్ చెప్పాడు.. అతను గొప్ప మ్యాచ్ విన్నర్ గా కొనియాడిన రోహిత్ జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అశ్విన్ వైపు చూసేవాళ్లమనీ గుర్తు చేసుకున్నాడు. 2010 శ్రీలంక పర్యటనలో హరారే వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అశ్విన్.. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్‌తో చివరి మ్యాచ్ ఆడాడు. రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా తరఫున 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి అశ్విన్ 765 వికెట్లు తీసాడు. బ్యాటింగ్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 4, 400 పరుగులు చేశాడు. 106 టెస్ట్‌ల్లో 25.75 సగటుతో 3503 పరుగులు చేసిన్ అశ్విన్.. 6 సెంచరీలతో పాటు 14 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.