ASSEMBLY ELECTIONS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నెమ్మదిగా సాగుతోంది. ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా పాతిక శాతానికి చేరుకోలేదు. ఉదయం పదకొండు గంటలకు 20.64 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే ఇది తక్కువ శాతమే. ఉదయం తొమ్మిది గంటల నుంచి ఓటింగ్ శాతం కాస్త పెరిగినప్పటికీ.. ఇంకా తక్కువ స్థాయిలోనే నమోదవుతోంది. ట్రెండ్ చూస్తుంటే ఈసారి తక్కువ శాతం ఓటింగ్ నమోదవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అన్నింటికంటే తక్కువగా హైదరాబాద్‌లో ఓటింగ్ నెమ్మదిగా సాగుతోంది. ఇక్కడ 12 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. నగరవాసులు ఓటు వేయడానికి ఉత్సాహంగా తరలిరావడం లేదు. సాధారణ ప్రజలు ఇంకా ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించడం లేదు కానీ.. సినీ, రాజకీయంసహా వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు మాత్రం ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. సినీ తారలు చిరంజీవి, నాగార్జున, జూ.ఎన్టీఆర్, శేఖర్ కమ్ముల, అల్లు అర్జున్, శ్రీకాంత్, రేవంత్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు వంటి ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో చిన్న చిన్న ఘర్షణలు మినహా.. ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు జరిగాయి.