T20 World Cup : ఇండియా ఇక్కడ.. ఆ మాత్రం ఉంటది

పదమూడేళ్ళ సుధీర్ఘ నిరీక్షణకు తెరపడిన వేళ... 17 ఏళ్ళ తర్వాత మళ్ళీ అందిన టీ ట్వంటీ వరల్డ్ కప్... అందులోనూ క్రికెట్ ను మతంలా, ఆటగాళ్ళను దేవుళ్ళులా ఆరాధించే తత్వం...

పదమూడేళ్ళ సుధీర్ఘ నిరీక్షణకు తెరపడిన వేళ… 17 ఏళ్ళ తర్వాత మళ్ళీ అందిన టీ ట్వంటీ వరల్డ్ కప్… అందులోనూ క్రికెట్ ను మతంలా, ఆటగాళ్ళను దేవుళ్ళులా ఆరాధించే తత్వం… ఇవి చాలు ఆ విజయం అందుకున్న విశ్వవిజేతలకు వెల్ కమ్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి…ప్రస్తుతం వరల్డ్ కప్ గెలిచి స్వదేశానికి వచ్చిన టీమిండియాకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు ఫ్యాన్స్… మోదీతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ముగిసిన తర్వాత ముంబై వెళ్ళిన భారత క్రికెటర్లకు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది.

విక్టరీ పరేడ్‍కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఇండియా.. ఇండియా, రోహిత్.. రోహిత్, కోహ్లీ.. కోహ్లీ అనే నినాదాలతో మోతెక్కించారు. హార్దిక్ పాండ్యా, జస్‍ప్రీత్ బుమ్రా సహా మరికొందరు ఆటగాళ్ల పేర్లను అరుస్తూ ప్రశంసించారు. వేలాదిగా అభిమానులు రావడంతో ఈ పరేడ్ చాలాసేపు సాగింది. ముంబై సాగర తీరం అభిమానులతో కిక్కిరిసిపోయింది. ప్రేక్షకులు ఆనందంతో హర్షధ్వానాల మోత మోగించారు. కాస్త ఆలస్యంగా ఈ పరేడ్ మొదలైనా అభిమానుల్లో మాత్రం జోష్ ఏ మాత్రం తగ్గలేదు. రహదారులన్నీ అభిమానులతో నిండిపోయాయి. స్టేడియంలో భారత జట్టును బీసీసీఐ ఘనంగా సత్కరించి 125 కోట్ల రూపాయల నజరానా అందజేసింది.