TDP-Janasena : ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. టీడీపీ-జనసేన లో తేలని సీట్ల పంచాయితీ..

ఏదైనా ఒకసారి జరిగింది.. రెండోసారి కూడా జరిగింది అంటే.. అది కచ్చితంగా మూడోసారి జరిగి తీరుతుంది. కన్ఫ్యూజింగ్‌గా ఉందా ! టీడీపీ, జనసేన (TDP-Janasena) పొత్తుల వ్యవహారం, సీట్ల పంచాయితీ ఇలానే ఉంది.

ఏదైనా ఒకసారి జరిగింది.. రెండోసారి కూడా జరిగింది అంటే.. అది కచ్చితంగా మూడోసారి జరిగి తీరుతుంది. కన్ఫ్యూజింగ్‌గా ఉందా ! టీడీపీ, జనసేన (TDP-Janasena) పొత్తుల వ్యవహారం, సీట్ల పంచాయితీ ఇలానే ఉంది. కావాలని మాట్లాడుతున్నారో.. రాజకీయాన్ని రగిలించాలని అంటున్నారో కానీ.. లోకేశ్‌(Lokesh) పవన్ మాటలు.. పొత్తుల వ్యవహారంపై అనుమానాలతో పాటు ఆసక్తిని పెంచుతున్నాయ్. టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదంటూ.. రెండు స్థానాలకు పవన్‌ అభ్యర్థులను ప్రకటించడంతో.. ఈ వ్యవహారం మరింత రసవత్తరంగా మారింది. ఇక టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంచాయితీ ఎప్పుడు తేలుతుందనే చర్చ.. ఇది కథ కాదు అనే రేంజ్‌లో సీరియల్‌గా సాగుతూనే ఉంది. ఒకసారి, రెండుసార్లు కాదు.. మూడుసార్లు. టిఫిన్ అని ఒకసారి.. లంచ్ అని మరోసారి.. సంక్రాంతి ముందు డిన్నర్ అని ఇంకోసారి.. మూడు పూటల భోజనాలు అయ్యాయ్ కానీ… సీట్ల పంపకాలపై మాత్రం క్లారిటీ రావడం లేదు. దీంతో టీడీపీ, జనసేన పొత్తు వ్యవహారం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది.

50 ఎమ్మెల్యే సీట్లు.. 6 ఎంపీ సీట్లు కావాలని పవన్‌ అడుగుతున్నారు. ఈ విషయంలో అసలు తగ్గొద్దు అంటూ హరిరామజోగయ్య (Harirama Jogaiah) లాంటి వాళ్లు పవన్‌ను అడుగుతున్నారు. ఇక వీటికితోడు.. రిపబ్లిక్ డే రోజు.. పవన్ వ్యాఖ్యలు, తీసుకున్న నిర్ణయాలు, ప్రకటించిన సీట్లు.. మరింత హాట్‌టాపిక్‌గా మారింది. వచ్చే ఎన్నికల్లో మూడోవంతు సీట్లలో జనసేన పోటీ చేస్తుందని అంటూ.. పవన్‌ మాట్లాడిన మాటలు.. టీడీపీలో ప్రకంపనలు రేపుతున్నాయ్. మూడవ వంతు అంటే సుమారు 60సీట్లు అన్నమాట. ఇది జరుగుతుందా అంటే.. అంత సీన్ లేదు అనే చర్చే జరుగుతోంది. ఇదంతా ఎలా ఉన్నా.. 60 సీట్లు కాకపోయినా.. క‌నీసం 45 సీట్లు అయినా న్యాయంగా కేటాయిస్తే.. బెటర్ అని జనసేన వర్గాలతో పాటు పవన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఐతే దీనికి చంద్రబాబు అంగీకరించడం లేదు. దీంతో పవన్ ముందు కొన్ని విన్నపాలు పెట్టినట్లు తెలుస్తోంది.

40 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి తీరల్సిందేనని పవన్ పట్టుపడుతుంటే.. 28 సీట్లు ప్లీజ్‌ ఒప్పుకోండి అంటూ.. చంద్రబాబు రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 28 సీట్లకు మించి జనసేనకు పోటీ చేసే అవకాశం కల్పించడం అంటే.. ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య.. వైసీపీకి చాన్స్ ఇచ్చినట్లే అవుతుందని చంద్రబాబు వివరించే ప్రయత్నం చేస్తున్నారట. ఐతే పవన్ మాత్రం పట్టిన పట్టు వీడడం లేదు. దీంతో సీట్ల పంచాయితీ తేలేది ఎప్పుడో అనే చర్చ జరుగుతోంది. నిజానికి అటు కాపు సామాజికవర్గంతో పాటు.. పార్టీ నేతల నుంచి జనసేనాని మీద భారీగా ఒత్తిడి కనిపిస్తోంది. తక్కువ స్థానాలకు అంగీకరించి.. పొత్తుకు సై అంటే.. రేపటి రోజు ప్రమాదం అనే భావనలో వాళ్లంతా కనిపిస్తున్నారు. దీంతో సీట్ల విషయంలో పవన్‌ తగ్గేదేలే అంటుంటే.. చంద్రబాబు మాత్రం విన్నపాలు వినవలె అన్నట్లుగా.. సేనాని కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.