ప్రజల దగ్గరకు వెళ్తే చాలు.. ఆ పని చేశారా.. ఈ హామీ నెరవేర్చారా అంటూ నిలదీస్తున్నారు. నిధుల కేటాయింపులు సరిగా లేక.. చేతిలో చిల్లిగవ్వ లేని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో పెండింగ్ పనులు పూర్తి చేయడం పెద్ద టాస్క్ గా మారిపోయింది. అందుకే ప్రగతి భవన్ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. తక్షణం అదనపు నిధులు కేటాయించి పెండింగ్ పనులు పూర్తి చేయకపోతే ఓట్లు, సీట్లు గల్లంతయ్యే ప్రమాదముందని సిట్టింగ్ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. ఇదే విషయంపై కేసీఆర్‌ను కలిసి గోడు వెళ్లబోసుకుంటున్నారు. ప్రతి ఎమ్మెల్యేకి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. అయితే ఇవి ఏమాత్రం సరిపోవడం లేదన్నది వాళ్ల మాట. తాను ప్రాతినిధ్యం ఇస్తున్న ప్రాంతంలో పనులు పూర్తి చేయాలంటే కనీసం 20 కోట్లు అవసరమవుతాయని ఓ ఎమ్మెల్యే కేసీఆర్‌కు లెక్కలు చూపించారంట.
నిధులు ఉంటేకదా ఇవ్వడానికి
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌లో ప్రగతి భవన్ ముందు క్యూ కడితే.. తెలంగాణ ప్రభుత్వం అప్పుల కోసం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ముందు చేతులు చాపుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే అప్పులపై కేంద్రం FRBM పరిమితులు విధించడంతో సంక్షేమ పథకాలను అమలు చేయడం కేసీఆర్ సర్కార్‌కు పెద్ద సవాల్‌గా మారిపోయింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ బారోయింగ్స్ పై ఉన్న పరిమితుల కారణంగా దాదాపు 20వేల కోట్ల రుణాలను తెలంగాణ ప్రభుత్వం పొందలేకపోయింది. ఎన్నికల సమయంలో పాలనపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో రిజర్వ్ బ్యాంక్ వేలంలో బాండ్ల ద్వారా నిధులు సమకూర్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని పదేపదే కోరుతోంది ప్రభుత్వం. ఆర్థిక శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఢిల్లీ స్థాయిలో దీని కోసం లాబీయింగ్ కూడా చేస్తున్నట్టు ఆంగ్లపత్రికల్లో వార్తలు వస్తున్నాయి.
సంక్షేమమే ఓట్ల మంత్రం..కానీ నిధులు లేవు
తెలంగాణలో హ్యాట్రిక్ విజయం సాధించాలనుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ గత 9ఏళ్లుగా తాము చేపట్టిన సంక్షేమ పథకాలే ఓట్లు కురిపిస్తాయిని చాలా నమ్మకంతో ఉంది. రైతుబంధు, దళితబంధు వంటి పథకాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఎన్నికల ఏడాదిలో నిధులు లేక ఖజానా వెక్కిరిచండం ఆపార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఓవైపు కేసీఆర్‌కు సిట్టింగ్ ఎమ్మెల్యే నుంచి నిధులు కావాలంటూ ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ కొత్తగా అమలు చేయాలనుకుంటున్న పథకాలకు నిధులు ఎలా సమకూర్చుకోవాలన్న ఆలోచన గులాబీ బాస్‌ను వేధిస్తోంది. కేంద్రం రుణ పరిమితులు పెంచకపోతే వేరే మార్గాల ద్వారా అప్పులు చేసేందుకు, నిధులు తెచ్చుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. రెండు మూడు నెలల లోపే తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ప్రభుత్వం ఏ చేయాలనుకున్నా ఈలోపే చేయాలి. ఒక్కసారి ఎన్నికల షెడ్యూల్ అమలులోకి వస్తే… ఇక ప్రభుత్వం పప్పులు ఉడకవ్. అందుకే ప్రగతి భవన్ ఆందోళన పడుతోంది…
ఢిల్లీలో లాబీయింగ్ ఫలిస్తోందా ?
కొన్ని నెలలక్రితం వరకూ బీఆర్ఎస్‌కు బీజేపీకి మధ్య పచ్చగడ్డి వేయకుండానం మండిపోయేది. కేసీఆర్ ప్రసంగం మొదలుపెడితే.. చాలూ.. మోడీ, అమిత్ షాలపై మాటల తూటాలు వదిలేవారు. బీజేపీని బొందపెట్టడమే ఏకైక లక్ష్యంగా బీఆర్ఎస్ నేతల స్పీచ్‌లు ఉండేవి. కానీ రాజకీయాల్లో అంతర్గత మిత్రత్వం కూడా ఉంటుంది. కవిత లిక్కర్ స్కా మ్ వ్యవహారంతో పాటు అనేక కారణాల వల్ల బీజేపీని విమర్శించడంలో బీఆర్ఎస్ వెనక్కి తగ్గిందనే విమర్శలున్నాయి. ఢిల్లీ విషయంలో కేసీఆర్ కాస్త మెతకవైఖరితో ఉన్నార చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో కేంద్రం తెలంగాణపై ఉన్న ఆర్థిక ఆంక్షల విషయంలో పాజిటివ్ గా స్పందిస్తున్న భావన వ్యక్తమవుతుంది. రాజకీయాల్లో ఎవరి ప్రయోజనాలు వాళ్లు చూసుకుంటారు. అందులో భాగంగానే అప్పుల విషయంలో బీఆర్ఎస్ సర్కార్ ఢిల్లీ స్థాయిలో చేస్తున్న లాబీయింగ్ ఫలించే అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ నేతలే అంతర్గతంగా చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేలు కోరుతున్నట్టు నియోజకవర్గాలకు అదనపు నిధులు ఇవ్వాలన్నా.. సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నా.. కొత్త హామీలు తెరపైకి తేవాలన్నా.. ప్రభుత్వానికి కొత్తగా అప్పులు పుట్టాల్సిందే… దీన్ని సమకూర్చుకునేందుకు కేసీఆర్ ఎలాంటి వ్యూహం వేస్తారు అన్నదే ఆసక్తిగా మారింది.