కంగారూలకు వారి సొంతగడ్డపైనే కంగారు పుట్టించిన టీమ్ ఏదైనా ఉందంటే అది టీమిండియానే… వారి స్లెడ్టింగ్ కు మాటలతో పాటు ఆటతోనూ ధీటుగా రిప్లై ఇవ్వడం ద్వారా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని వరుసగా రెండుసార్లు గెలిచింది. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతోంది. స్వదేశంలో ఇటీవల కివీస్ చేతిలో భారత్ వైట్ వాష్ పరాభవం ఎదుర్కొన్నప్పటకీ ఆసీస్ గడ్డపై మాత్రం సత్తా చాటాలని భావిస్తోంది. అటు ఆసీస్ కూడా టీమిండియాను తేలిగ్గా తీసుకోవడం లేదు. ముఖ్యంగా రిషబ్ పంత్ ను చూస్తే ఆసీస్ క్రికెటర్లకు ప్యాంట్లు తడుస్తున్నాయి. ఎందుకంటే గబ్బా వేదికగా 2021 సిరీస్ లో చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడిన పంత్ భారత్ కు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని అందించాడు. ఆ మ్యాచ్ లో పంత్ చూపిన పోరాటపటిమ అంతా ఇంతా కాదు. మామూలుగానే టెస్టు మ్యాచ్ లలో నాలుగో ఇన్నింగ్స్ లో ఛేజింగ్ చేయడం కష్టం… అలాంటిది గబ్బా లాంటి పేస్ పిచ్ పై కంగారూల పేస్ బౌలింగ్ ను ఎదుర్కొంటూ మ్యాచ్ ను గెలిపించడం అంటే మామూలు విషయం కాదు.
కీలక ఆటగాళ్ళందరూ పెవిలియన్ కు చేరుకున్న వేళ టెయిలెండర్లతో కలిసి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన పంత్ ను కంగారూలు ఎప్పటికీ మరిచిపోరు. అందుకే ఈ సారి సిరీస్ లోనూ యువ వికెట్ కీపర్ నే టార్గెట్ చేస్తున్నారు. పంత్ ను కట్టడి చేయకుంటే తమకు ఇబ్బందేనని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అంగీకరించాడు. అతను ఎప్పుడూ ఆటను చాలా వేగంగా మార్చగలిగిన వ్యక్తిగా అభివర్ణించాడు. ఇలాంటి యర్స్ కు ప్రత్యేకంగా ప్లాన్స్ ఉండాల్సిందేనని చెప్పుకొచ్చాడు.గత సిరీస్ లో ఆస్ట్రేలియా పిచ్ లపై అతడు చాలా బాగా ఆడాడని గుర్తు చేశాడు. పంత్ క్రీజులో ఉన్నంతసేపూ చాలా ప్రమాదకరమేనన్న కమ్మిన్స్ అతని కోసం ప్రత్యేకంగా ప్లాన్స్ సిద్ధం చేసుకున్నట్టు చెప్పాడు. తమ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయని ఆశిస్తున్నట్టు ఈ ఆసీస్ కెప్టెన్ వ్యాఖ్యానించాడు.
ఇదిలా ఉంటే స్వదేశంలో టెస్టు మ్యాచ్ ఆడిన ప్రతిసారీ ఒత్తిడి ఉంటుందన్నాడు. ఇది తమకు అలవాటు అయిన ఒత్తిడేనని, ఈసారి మెరుగ్గా రాణిస్తామన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలవాలన్న ప్లానింగ్ లోనే కీలక ఆటగాళ్ళకు కొన్ని సిరీస్ లలో ఆడించడం లేదన్నాడు. మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు కూడా చేరాలనే టార్గెట్ ఉందని కమ్మిన్స్ చెప్పాడు.ఆ టైటిల్ ను కాపాడుకోవాలనే పట్టుదలతో ఉన్నామనీ, డబ్ల్యూటీసీలో కీలక పాయింట్లు సాధించడానికి ఈ సిరీస్ లో మంచి అవకాశం ఉందన్నాడు. కాగా గతేడాది ఇండియాను రెండుసార్లు ఓడించి డబ్ల్యూటీసీ టైటిల్, వన్డే వరల్డ్ కప్ గెలిచినా.. ఓ టెస్టు సిరీస్ లో ఇప్పటి వరకూ కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా.. భారత్ ను ఓడించలేకపోయింది. ఇప్పుడా రికార్డును కూడా తన ఖాతాలో వేసుకోవాలని కమ్మిన్స్ ఎదురుచూస్తున్నాడు. 2014-15లో చివరిసారిగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచిన ఆసీస్ కు అప్పటి నుంచి భారత్ షాకిస్తూనే ఉంది.