ప్రతీ మనిషికి కాస్త తిక్క ఉంటది.. ఆ తిక్క పోలీసోడికి ఓ స్పూన్ ఎక్కువే ఉంటది. ఆ తిక్కకు పవర్ వస్తే.. పవర్ ఇస్తే.. మంచి కోసం, మన కోసం ఎంతవరకైనా వెళ్తారు. అలాంటి అధికారే.. ఏవీ రంగనాథ్. ఆయన మాట సంచలనం.. ఆయన చర్య సంచలనం. ఏవీ రంగనాథ్ అంటే… ఆవుల వెంకట రంగనాథ్ మాత్రమే కాదు. నమ్మిన పని కోసం ఎవరి మాటా వినని రంగనాథ్. ఈ గుణమే ఇప్పుడు ఆయనను నేషనల్ హీరో చేసింది. దేశమంతా మాట్లాడుకునేలా చేస్తోంది. ఐపీఎస్ పవర్ ఏంటో తెలుస్తోంది.
హైడ్రాతో.. నాగార్జున N కన్వెన్షన్ కూల్చివేతతో ఆయన పేరు చుట్టూ ఇప్పుడు చర్చ జరుగుతున్నా.. గతంలో ఎన్నో సంచలనాలకు కేరాఫ్ ఆయన. అన్యాయం అనే మాట వింటే.. దాని అంతుచూసే వదలరు ఆయన. ఏదైనా సమస్యను టేకప్ చేశారా.. లెక్క తేల్చే వరకు నిద్రపోరు. దుర్మార్గులపాలిట గబ్బర్ సింగ్.. అన్యాయం చేసే వాళ్లకు అవేకింగ్. ట నిక్కచ్చి.. మనిషి నిక్కచ్చి.. డ్యూటీ అంతకుమించి నిక్కచ్చి. అందుకే అధికారంలో ఎవరు ఉన్నా.. ఏ పార్టీది అధికారం అయినా.. ఆయన అందరికీ ఫేవరెట్. ఇప్పుడు హైడ్రాతో హడల్ పుట్టిస్తున్నారీ సూపర్ కాప్. వాళ్లు వీళ్లు అని తేడా లేదు. నిర్మాణం అక్రమం అని తేలిందా.. బుల్డోజర్లు పంపించడమే! అందుకే ఈ పేరు ఇప్పుడు అక్రమార్కులకు నిద్రలేకుండా చేస్తోంది. కబ్జాకోరుల గుండెల్లో పరుగులు పెట్టిస్తోంది.
భయపెట్టాలని కొందరు.. బెదిరించాలని మరికొందరు.. రంగనాథ్ మాత్రం వెనక్కి తగ్గేదే లే అంటున్నారు. ఫర్ యూ, విత్ యూ ఆల్వేస్ అనే నినాదంతో.. జనం కోసం.. జనం తరఫున అంటూ.. డ్యూటీలో దూసుకుపోతున్నారు. లక్ష్యం మీద స్పష్టత ఉంటే.. ప్రయాణించే మార్గం ఈజీ అవుతుందని నమ్మే రంగనాథ్.. విద్యార్థి దశ నుంచి ఇప్పుడు హైడ్రా కమిషనర్ వరకు.. ప్రతీ ప్రయాణంలో అదే విశ్వాసంతో ముందుకు వెళ్తున్నారు. 1996 గ్రూప్ 1 బ్యాచ్‌లో డీఎస్పీ ర్యాంక్‌లో స్థిరపడిన రంగనాథ్.. 2వేల సంవత్సరంలో గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కొత్తగూడెం డీఎస్పీగా బదిలీ అయ్యారు.
అక్కడ మైక్రోఫైనాన్స్ దందా పేరుతో పేదల రక్తం పీల్చే జలగలను ఏరిపారేశారు. ఆ తర్వాత వరంగల్ జిల్లా నర్సంపేట డీఎస్పీగా పనిచేశారు. 2004లో ఎన్నికల వేళ నక్సల్స్ అడ్డా అయిన ప్రకాశం జిల్లా మార్కాపురంలో విధులు నిర్వర్తించారు. వైఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం, నక్సల్స్ చర్చల సందర్భంలో… నక్సల్స్ కేంద్ర నాయకులు రామకృష్ణ వంటి వారిని స్థానిక అధికారిగా స్వాగతించారు. ఆ తర్వాత తూర్పుగోదావరి అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. అక్కడ గ్రేహౌండ్స్ ఆపరేషన్స్ పునరుద్ధరించడంలో కీలకంగా ఉన్న రంగనాథ్.. 2012 చివరివరకు అక్కడ పనిచేశారు. ఆ సమయంలో రంగనాథ్ పనికి గుర్తింపుగా రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు దక్కింది.
2014 వరకు ఖమ్మం ఎస్పీగా పనిచేసి, అక్కడి నుంచి నల్లగొండకు బదిలీ అయ్యారు. అక్కడ దాదాపు నాలుగేళ్లు పనిచేశారు. ఆ తర్వాత వరంగల్ సీపీగా పనిచేశారు. ఓరుగల్లులో తన దూకుడు ఏంటో చూపించారు. భూకబ్జాలకు పాల్పడిన వారిని, ల్యాండ్ సెటిల్‌మెంట్లు చేస్తూ జనాలను ఇబ్బందుకు గురిచేస్తున్న వారిని… అరెస్టు చేసి జైళ్లకు పంపారు. నేరగా జనాలతో, బాధితులతో టచ్‌లో ఉంటూ సమస్యలను స్వయంగా తెలుసుకోవడం రంగనాథ్ స్పెషాలిటీ. కబ్జా ఆరోపణలు వచ్చాయని.. డైరెక్ట్‌గా ఓ ఎమ్మెల్యేను నిలదీశారు అంటే.. ఇది చాలదా రంగనాథ్ ధైర్యం, డ్యూటీ అంటే ఇష్టం ఏంటో చెప్పడానికి !
ఈ గుణమే.. సీఎం రేవంత్ అభిమానానికి కారణం అయింది. తను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే.. తన మానస పుత్రిక అయిన హైడ్రాకు ఐజీ స్థాయి అధికారి అయిన రంగనాథ్‌ను కమిషనర్‌గా నియమించి ఫుల్ పవర్స్ అప్పగించారు. హైడ్రాతో రంగనాథ్ తనదైన శైలిలో పనిచేస్తూ వెళ్తున్నారు. హైడ్రా దూకుడుకు పలుకుబడి కలిగిన వ్యక్తులే కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారు. అందుకే ఆయనను ఎవరి మాటా వినని రంగనాథ్ అనేది !