Ayodhya Ram Mandir: బాలరాముడి దివ్యరూపం ఇదే.. కృష్ణశిలతో రూపుదిద్దుకున్న రామ్ లల్లా

ఇప్పటికే బాల రాముడి విగ్రహం గర్భ గుడిలోకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ విగ్రహ రూపంలో రాముడు.. ప్రాణ ప్రతిష్ఠ తరువాత అందరికీ దర్శనమిస్తాడని భావించారు. కానీ, అందరికీ ముందుగానే దర్శనమిచ్చాడు.

  • Written By:
  • Updated On - January 19, 2024 / 08:24 PM IST

Ayodhya Ram Mandir: అయోధ్యలో బాలరాముడు భక్తులకు సాక్షాత్కరించాడు. బాల రాముడు ఎలా ఉంటాడో అన్న కోట్లాది మంది భక్తుల ఉత్కంఠకు తాజాగా తెరపడింది. కృష్ణ శిలతో రూపుదిద్దుకున్న బాల రాముడి విగ్రహం భక్తులకు దర్శనమిచ్చింది. దీంతో బాలరాముడిని చూసి భక్తులు తరిస్తున్నారు. అయోధ్యలో కొలువుదీరనున్న బాలరాముడి రూపానికి సంబంధించిన చిత్రాలు విడుదలయ్యాయి. చిరు నవ్వులు చిందిస్తున్నట్లు ఉన్న ఈ రాముడి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Amrapali Kata: మేడం రేంజ్‌ మారిపోయింది.. సీఎంతో కలిసి లండన్‌లో అధికారులతో అమ్రాపాలి భేటి..

ఇప్పటికే బాల రాముడి విగ్రహం గర్భ గుడిలోకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ విగ్రహ రూపంలో రాముడు.. ప్రాణ ప్రతిష్ఠ తరువాత అందరికీ దర్శనమిస్తాడని భావించారు. కానీ, అందరికీ ముందుగానే దర్శనమిచ్చాడు. ఇంతకాలం బాల రాముడి ముఖం కనిపించకుండా వస్త్రంతో కప్పి ఉంచారు. ఈ రోజు ఆ గంతలు తొలగించారు. దీంతో బాల రాముడి దివ్య రూపం భక్తులకు దర్శనమిచ్చింది. కృష్ణ శిలతో తయారైన బాల రాముడి విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. సాధారణంగా ప్రాణ ప్రతిష్ఠ రోజున కళ్లపై ఉన్న తెరను తొలగిస్తారు. అయితే, రాముడి కళ్లకు గంతలు తొలగించడంతో అందరికీ ముందుగానే దర్శనభాగ్యం కలిగింది. బంగారు విల్లు, బాణం పట్టుకున్న ఐదేళ్ల రాముడి విగ్రహాన్ని మైసూరుకి చెందిన అరుణ్ యోగిరాజ్ తయారు చేశాడు. ఈ విగ్రహం పొడవు 51 ఇంచులు కాగా, విగ్రహం బరువు 150 కేజీలు. నల్లని కలువ తామరపై ఐదేళ్ల బాలరాముడి రూపంలో మూలవిరాట్ ఉన్నారు.

కాశీకి చెందిన జ్ఞానేశ్వర్‌ శాస్త్రి ఆధ్వర్యంలో ఇవాళ, రేపు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. జనవరి 22న అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12:20 నిమిషాల నుంచి ఒంటి గంట వరకు, ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు జరిపించనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కేవలం కొంత మంది అతిథులకే ఆ రోజు ఆలయంలోకి అనుమతి ఉంటుందని ట్రస్ట్ వెల్లడించింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోసహా మరి కొందరు ప్రముఖులతో కలిపి, మొత్తం 8 వేల మంది అతిథులు ఈ క్రతువుకు హాజరవుతున్నారు. అతిథుల్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, అక్షయ్ కుమార్‌, రజినీ కాంత్ వంటి ప్రముఖులు ఉన్నారు. విదేశాల నుంచి కూడా పలువురు హాజరవుతున్నారు. శ్రీరాముని వంశానికి చెందిన వారిగా చెప్పుకునే కొరియన్‌ రాణికి కూడా ఆహ్వానం అందింది.

అయితే, ఆరోజు సామాన్య భక్తులకు ప్రవేశం లేదు. 23 నుంచి భక్తులకు రామ్‌లల్లా దర్శన భాగ్యం కల్పిస్తారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ట సందర్భంగా పలు రాష్ట్రాలు ఆ రోజున సెలవు ప్రకటించాయి. అయోధ్య రాముడి కోసం బాహుబలి అగరబత్తిని తయారు చేశారు. 108 అడుగుల పొడవు, 3.5 వెడల్పుతో భారీగా దూప్‌స్టిక్‌ను వెలిగించారు.