AYODHYA TO TIRUMALA: ప్రపంచంలోని హిందూ ఆలయాల్లో కలియుగ వైకుంఠపురంగా పిలిచే తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరుడి ఆలయం అత్యంత ధనవంతమైనది. ఇక్కడి శ్రీవారి దర్శనానికి ప్రతి రోజూ వేల మంది భక్తులు వస్తుంటారు. ఇప్పుడు అయోధ్యలోని బాలక్ రామ్ మందిరానికి కూడా భక్తుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి రోజూ పెద్ద ఎత్తున జనం తరలి వస్తుండటంతో ఆ రద్దీని ఎలా కంట్రోల్ చేయాలో రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌కి అర్థం కావడం లేదు. అందుకే తిరుమల ఆలయంలో భక్తుల రద్దీకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో స్టడీ చేయాలని నిర్ణయించారు ట్రస్ట్ కమిటీ సభ్యులు. ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో జనవరి 22నాడు బాలక్ రామ్‌కి ప్రాణ ప్రతిష్ట జరిగింది.
KUMARI AUNTY: కుమారి ఆంటీ హోటల్ మూయించింది వాళ్లేనా?
మొదటి రోజు VIPలు దర్శనాలు చేసుకున్నారు. ఇక తెల్లారి నుంచి సామాన్య భక్తులను కూడా అనుమతించడంతో రోజుకి 2 నుంచి 3 లక్షల మంది బాల రాముడి దర్శనానికి క్యూ కడుతున్నారు. ఉదయం ఏడింటి నుంచి దర్శనానికి ఆలయం తెరుస్తుండగా.. తెల్లవారుజామున 2,3 గంటల నుంచే భక్తులు భారీ సంఖ్యలో క్యూలు కడుతున్నారు. దాంతో భక్తుల రద్దీని ఎలా తట్టుకోవాలి.. ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అనేదానిపై రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మల్లగుల్లాలు పడుతోంది. అందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతిలో TTD అనుసరిస్తున్న విధానంపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ప్రపంచంలోని హిందూ దేవాలయాల్లో అత్యంత ఎక్కువ ఆదాయం వచ్చేది తిరుమల తిరుపతి నుంచే. ఇక్కడి స్వామి దర్శనానికి ప్రతి రోజూ సగటున 60 వేల మంది భక్తులు వస్తుంటారు. ఏడాది మొత్తం చూస్తే 2 కోట్ల 40 లక్షల మంది దాకా భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఇతర పండుగల రోజుల్లో మాత్రం రోజుకి లక్ష మంది దాకా దర్శనం చేసుకుంటారు. సాధారణ రోజుల్లో వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
క్యూ కాంప్లెక్సుల్లో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది టీటీడీ. భక్తులు కూడా శ్రీవారి దర్శనానికి గంటలు గంటలుగా ఎదురు చూస్తూ ఉంటారు. వైకుంఠ ఏకాదశి, జనవరి ఫస్ట్, ఇంకా కొన్ని పండగల సందర్భాల్లో మాత్రమే భక్తుల రద్దీని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. దేశవ్యాప్తంగా డజన్‌కు పైగా శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయాలను TTD నిర్వహిస్తోంది. జమ్ము, హర్యానా, న్యూఢిల్లీ, ముంబై, భువనేశ్వర్, హైదరాబాద్, చెన్నై, కన్యాకుమారి, బెంగళూరుల్లో.. ప్రస్తుతం TTD ఆలయాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలోనూ శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఉండేలా తిరుమల తిరుపతి దేవస్థానం ప్లాన్ చేస్తోంది. పెద్దసంఖ్యలో వచ్చే భక్తుల కోసం టీటీడీ ఎలాంటి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది అన్నదానిపై అయోధ్య ట్రస్ట్ అధికారులు స్టడీ చేయాలని నిర్ణయించారు. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో ట్రస్ట్ అధికారులు ఫోన్‌లో సంప్రదించారు. అయోధ్య నుంచి ఓ బృందం ప్రత్యేకంగా తిరుమలకు రావాలని నిర్ణయించింది. అయోధ్యలో భక్తులకు క్యూ కాంప్లెక్స్‌లు.. ఏర్పాట్లకు సంబంధించి అన్నివిధాలా సహకరిస్తామని టీటీడీ అధికారులు ట్రస్ట్ సభ్యులకు హామీ ఇచ్చారు.
నిజానికి దేశంలోని చాలా ఆలయాలకు టీటీడీ ఆదర్శంగా నిలుస్తోంది. గతంలో మహారాష్ట్రలోని షిరిడీ సంస్థాన్ ట్రస్ట్, జమ్ములోని మాతా వైష్ణోదేవి మందిరం ట్రస్ట్ అధికారులు కూడా తిరుమలకు వచ్చి టీటీడీ నుంచి వివరాలు సేకరించారు. భక్తుల రద్దీని కంట్రోల్ చేయడానికి టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అధ్యయనం చేసి వెళ్ళి.. ఆ దేవాలయాల్లో అమలు చేశారు. ఇప్పుడు అయోధ్య బాలక్ రామ్ ఆలయం అధికారులు కూడా తిరుమలకు వచ్చి తిరుమలలో ఏర్పాట్లను పరిశీలించనున్నారు.