టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ అటు సినిమాలతో పాటు ఇటు రెస్టారెంట్ బిజినెస్‌లోనూ అడుగుపెట్టాడు. వివాహ భోజనంబు అనే పేరుతో హైదరాబాద్‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో రెస్టారెంట్లు ఓపెన్ చేశాడు. ఈ రెస్టారెంట్లు తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నాయ్. ఐతే ఈ మధ్య కాలంలో.. హైదరాబాద్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులపై ఆహార భద్రతా అధికారులు దాడులు చేస్తున్నారు. ఆ సోదాల్లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయ్.
పాడైపోయిన వస్తువులతో వంటకాలు, గడువు దాటిన ఆహార పదార్ధాలు, ఫ్రిజర్‌లో దాచి ఉంచిన మాంసం… కిచెన్‌లో బల్లులు, బొద్దింకలు… ఇలా తినాలంటనే వాంతికొచ్చేలా కిచెన్లలో దారుణ పరిస్థితులను వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు హీరో సందీప్ కిషన్‌కు చెందిన హోటల్‌లోనూ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, టాస్క్‌ఫోర్స్ అధికారులు… సికింద్రాబాద్‌లోని వివాహ భోజనంబు రెస్టారెంట్‌లో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో రెస్టారెంట్‌లో అనేక ఉల్లంఘనలు గుర్తించారు. గడువు ముగిసిన 25 కేజీల చిట్టి ముత్యాలు బియ్యాన్ని పట్టుకున్నారు. నాణ్యత లేని ఈ బియ్యంతోనే ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు తెలిసింది.
సీల్ చేయబడిన కొన్ని ఆహార పదార్థాలను కూడా గుర్తించారు. అయితే వాటికి సరైన లేబుల్స్ లేవు. వాటిని ఫ్రిజ్‌లో నిల్వచేసి కస్టమర్లకు వేడి చేసి ఇస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. కిచెన్‌లోని డస్ట్‌బిన్లలో మూతలు కూడా సరిగ్గా లేకపోవటాన్ని అధికారులు గుర్తించారు. ఫుడ్ హ్యాండ్లర్‌లకు సరైన మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు కూడా లేవని తెలుస్తోంది. వంటగదిలో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఆహార పదార్థాల తయారీకి, కస్టమర్లకు అందించే నీటికి సంబంధించిన సరైన ధృవపత్రాలు కూడా లేకపోవటం తనిఖీల్లో బయటపడింది. ఇది కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది. చూసుకోవాలి కదా హీరో.. ఫుడ్ పేరుతో చెత్త పెడితే ఎలా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.