ఇంతకీ ఎవరీ బిల్కిస్ బానో ?
బిల్కిస్ బానో పేరు వింటేనే ఘోర విషాదం కళ్లముందు కదులుతుంది. కొంతమంది వ్యక్తులు క్రూర మృగాలుగా మారి ఓ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన దుర్మార్గపు ఘటనలు గుర్తుకొస్తాయి. మనదేశంలో జరిగిన రాజకీయ, మతపరమైన ఘర్షణల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది రోడ్డున పడ్డారు. కానీ బిల్కిస్ బానోది అందరిదీ మించిన విషాదం. బిల్కిస్ బానో..గుజరాత్‌కు చెందిన ఓ ముస్లిం మహిళ. ఆమెది సాధారణ మధ్యతరగతి కుటుంబం. 2002 ఫిబ్రవరి వరకు ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఆ తర్వాతే ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. విషాదాన్ని మిగిల్చింది.
గోధ్రా ఘర్షణలతో మొదలు
అది 2002.. గోధ్రా మత ఘర్షణలతో గుజరాత్ అల్లకల్లోలంగా మారింది. గోధ్రా స్టేషన్‌లో శబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టడం, అయోధ్య నుంచి ఆ ట్రైన్‌లో తిరిగి వస్తున్న వందలాది మంది యాత్రికులు, కరసేవకులు ప్రాణాలు కోల్పోవడంతో గుజరాత్‌లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హిందూ, ముస్లింల మధ్య దాడులు ప్రతిదాడులతో గుజరాత్ రణరంగంగా మారిపోయింది.
2002 ఫిబ్రవరి 28 – మత ఘర్షణలతో చాలా మంది బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లతీస్తున్న రోజులవి.బిల్కిస్ బానో కుటుంబం కూడా వారిలో ఒకటి. మత ఘర్షణలకు తమ కుటుంబం కూడా బలైపోతుందేమోనన్న భయంతో బిల్కిస్‌బానో కుటుంబం వేరే ప్రాంతానికి వెళ్లాలనుకుంది. 2002 ఫిబ్రవరి 28న దాహోద్ జిల్లాలోని సొంతూరు రాధిక్‌పూర్ వదిలి వేరే ప్రాంతానికి బయలుదేరింది బిల్కిస్ బానో కుటుంబం. మూడున్నరేళ్ల కుమార్తెతో పాటు మిగతా 15 మంది కుటుంబ సభ్యులతో కలిసి సొంతూరును వీడింది బిల్కిస్ బానో.
2002 మార్చి 3- బిల్కిస్ బానో కుటుంబం చప్పర్‌వాద్ అనే గ్రామం చేరుకుంది. మత ఘర్షణల నుంచి తప్పించుకునేందుకు వేరే ప్రాంతానికి చేరుకున్నా… బిల్కిస్ బానోను మాత్రం అవి వెంటాడుతూనే వచ్చాయి. చప్పర్‌వాద్ గ్రామంలో కత్తులు, కర్రలతో ఉన్న 30 మంది మూక ఒక్కసారిగా బిల్కిస్ బానో కుటుంబంపై అత్యంత హేయంగా దాడికి పాల్పడింది. బిల్కిస్‌తో పాటు ఆమె తల్లి మరో ముగ్గురు మహిళలను లైంగికంగా వేధించి అత్యాచారానికి పాల్పడ్డారు. మిగతా వాళ్లపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. గోధ్రా మత ఘర్షణల తర్వాత జరిగిన ఈ దాడిలో బిల్కిస్ బానో తన కుటుంబాన్ని కోల్పోయింది. మొత్తం 17 మంది కుటుంబ సభ్యుల్లో 8మంది దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురి ఆచూకీ లేకుండా పోయారు. బిల్కిస్‌తో పాటు మరో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది.
కేసు నమోదు చేయకుండా బెదిరింపులు
ఓ కుటుంబంపై అత్యంత దారుణంగా దాడి చేసి అత్యాచారానికి పాల్పడి ప్రాణాలు కూడా తీస్తే..వెంటనే ప్రభుత్వం, పోలీసులు వేగంగా స్పందించి ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి. కానీ బిల్కిస్ బానో కేసులో అలా జరగలేదు. సరైనా ఆధారాలు లేవంటూ స్థానిక పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. 2002-2003 మధ్య కాలంలో పోలీసు స్టేషన్ల చుట్టూ బిల్కిస్ బానో తిరుగుతూనే ఉంది. కేసు నమోదు చేయాలని వెంట పడితే పరిస్థితులు వేరేరకంగా ఉంటాయంటూ పోలీసులు ఆమెను బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. బిల్కిస్ బానో చివరి ప్రయత్నంగా జాతీయ మానవ హక్కుల కమిషన్‌తో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించడం సీబీఐ విచారణ మొదలయ్యింది.
సీబీఐ విచారణ ఎలా సాగింది ?
బిల్కిస్ బానో కుటుంబంపై జరిగిన దాడే హేయమైనదైతే.. నిందితులను రక్షించేందుకు అనేక శక్తులు చేతులు కలిపాయి. సాక్ష్యాలను తారుమారు చేయడం, తప్పుడు నివేదికలను రూపొందించడం వంటి చర్యలతో బిల్కిస్ బానో కేసు మరింత సంక్లిష్టంగా మారింది. దర్యాప్తు కొనసాగుతున్నంత కాలం బిల్కిస్ బానోను హత్య చేసేందుకు ఎన్నో కుట్రలు జరిగాయి.
గుజరాత్ నుంచి మహారాష్ట్రకు మారిన సీన్
2004 జనవరిలోనే సీబీఐ అధికారులు నిందితులను అరెస్ట్ చేశారు. బిల్కిస్ బానో కేసులో అన్ని ఆధారాలను సేకరించారు. అయితే బిల్కిస్ బానోను చంపుతామని బెదిరింపులు రావడంతో పాటు సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదమందని బాధిత కుటుంబం అనుమానాలు వ్యక్తం చేయడంతో గుజరాత్ హైకోర్టు కేసు విచారణను అహ్మదాబాద్ నుంచి ముంబైకి మార్చింది.
అందరూ దోషులే
ఎట్టకేలకు బిల్కిస్ బానో కేసు విచారణ కొలిక్కి వచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న 13మందిని 2008 జనవరిలో దోషులుగా తేల్చింది ట్రయల్ కోర్టు. వారిలో 11మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ తర్వాత కూడా దోషులు శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. చివరకు 2017 మేలో మేలో బాంబే హైకోర్టు 11 మందికి శిక్షలను ఖరారు చేసింది. సుప్రీంకోర్టు బిల్కిస్ కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కూడా ఆదేశించింది.
మళ్లీ కథ అడ్డం తిరిగింది
సుధీర్ఘ న్యాయపోరాటం తర్వాత బిల్కిస్ బానో కుటుంబానికి న్యాయం జరిగిందని అందరూ భావించినా.. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దోషులకు స్వేచ్ఛ కల్పించింది. గతేడాది ఆగస్టు 15న గోధ్రా సబ్ జైల్ నుంచి 11 మంది దోషులు విడుదలయ్యారు. దీంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు సుప్రీంకోర్టు కూడా గుజరాత్‌కు అక్షింతలు వేసింది. ఇంతటి తీవ్ర నేరం చేసిన వ్యక్తులు జైలు శిక్ష అనుభవిస్తుండగా ఎలా విడుదల చేస్తారంటూ నిలదీసింది. బిల్కిస్ బానో తరహా కేసులు మళ్లీ పునరావృతం అయితే పరిస్థితి ఏంటంటూ ప్రశ్నించింది. దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది.